అక్షరటుడే, కామారెడ్డి: Counterfeit Toddy Arrest | ఆల్ప్రాజోలం మత్తు పదార్థంతో కల్తీ చేసిన కల్లును విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు (Kamareddy Police) అరెస్టు చేశారు. ఈ దాడిలో 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సదాశివనగర్ (sadashivanagar) సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
Counterfeit Toddy Arrest | తాడ్వాయి పోలీసులు ఆధ్వర్యంలో..
విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం తాడ్వాయి ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు కరడ్‌పల్లి గ్రామంలోని ఓ కల్లు దుకాణంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న విక్రేత సీతూరి అలియాస్ గౌండ్ల పోచాగౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కల్లులో ఆల్ప్రాజోలామ్ కలిపి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు.
అదే సమయంలో అక్కడ కల్లు తాగుతున్న ఇద్దరికి నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో బెంజోడయాజెపైన్ పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చేసిన వైద్య పరీక్షల్లోనూ ఇదే నిర్ధారణ అయింది. దర్యాప్తులో భాగంగా గురువారం దుకాణ లైసెన్స్ హోల్డర్ కొండాపురం స్వామిగౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఎక్కువ లాభాల కోసమే కల్తీకి పాల్పడినట్లు అతను అంగీకరించాడు. పోలీసులు ఈ కేసులో 60 కల్లు సీసాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ తెలిపారు.