అక్షరటుడే, వెబ్‌డెస్క్: DGP Anand Review | పోలీసులు నిత్యం ప్రజల్లో మమేకమై పనిచేయాలని, క్యాంపు కార్యాలయాలకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కనిపించే పోలీసింగ్ (విజిబుల్ పోలీసింగ్)ను మరింత బలోపేతం చేయాలని తెలంగాణ డీజీపీ డా. జితేందర్ స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సై స్థాయి నుంచి అంతకంటే పైస్థాయి పోలీసు అధికారులతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
గత మే 30న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన ఆదేశాల అమలుపై సమీక్ష నిర్వహించిన డీజీపీ, ప్రతి స్థాయిలో నిరంతర పర్యవేక్షణే పోలీసు శాఖ పనితీరుకు కీలకమని పేర్కొన్నారు.
విజిబుల్ పోలీసింగ్, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, చట్ట అమలు, ప్రజలకు చేరువయ్యే విధానాలపై అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత మేరకు పనిచేస్తున్నారనే అంశాలపై సమీక్షించారు.
DGP Anand Review | ప్రజలతో నిరంతర కమ్యూనికేషన్
పోలీసు అధికారులు క్యాంపు కార్యాలయాల్లోనే ఉండకుండా ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకోవాలని, ముఖ్యంగా ఎస్సై స్థాయి అధికారులు ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని డీజీపీ ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో విజిబుల్ పోలీసింగ్ అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
మంచి పనితీరు కనబరిచే అధికారులను ప్రోత్సహిస్తూ రివార్డులు అందజేస్తామని, అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు.
IAS Officer Y. Srilaxmi | శిఖరం నుంచి పతనం.. మళ్లీ బాధ్యతల వైపు : వై. శ్రీలక్ష్మి పరిపాలనా ప్రయాణం
DGP Anand Review | తప్పనిసరిగా హాజరుకావాలి
వీడియో కాన్ఫరెన్స్‌కు రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన లా అండ్ ఆర్డర్, సీఐడీ, టెక్నికల్ సర్వీసెస్, ఇంటెలిజెన్స్, రైల్వే అండ్ రోడ్ సేఫ్టీ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, తెలంగాణ పోలీస్ అకాడమీ, ఈగిల్, వివిధ కమిషనరేట్లు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జిల్లా, సబ్‌డివిజన్, సర్కిల్ కార్యాలయాల నుంచి ఎస్సై స్థాయి అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
అత్యవసర పరిస్థితులు మినహా ఇటువంటి సమీక్ష సమావేశాలకు ప్రతి అధికారి తప్పనిసరిగా హాజరుకావాలని, ఆదేశాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని డీజీపీ స్పష్టం చేశారు. ఆదేశాలు జారీ చేయడం మాత్రమే కాకుండా, అవి క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.