Green Water Tankers | జలమండలి కీలక నిర్ణయం.. ఎల్లుండి నుంచి శుద్ధి చేసిన నీటి సరఫరా

నగరంలో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని జలమండలి ఎండీ అశోక్​ రెడ్డి ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Green Water Tankers | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో రానున్న రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉంది. రిజర్వాయర్​లలో నీరు లేకపోవడంతో జలమండలి అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ మేరకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని నిర్ణయించారు.

నగరంలో నవంబర్ 1 నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని జలమండలి (HMWSSB) ఎండీ అశోక్​ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ట్యాంకర్ల నమోదు, ఎస్టీపీల వద్ద ఫిల్లింగ్ పాయింట్ల ఏర్పాటు, వినియోగదారుల గుర్తింపు, ప్రభుత్వ శాఖలతో సమన్వయంపై పలు సూచనలు చేశారు.

Green Water Tankers | ఒత్తిడి తగ్గించేందుకు..

ఎల్​నినో నేపథ్యంలో నగరంలో నీటి సరఫరాకు ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. ఇప్పటికే భూగర్భ జలాలు తోతుకు పడిపోయాయి. దీంతో భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గించేందుకు శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని జలమండలి నిర్ణయించింది. మురుగు నీటిని ఎస్టీపీల వద్ద శుద్ధి చేసిన అనంతరం.. గ్రీన్​ ట్యాంకర్లలో నింపుతున్నారు. ఈ నీటిని తాగునీటి అవసరాలకు కాకుండా ఇతర పనుల కోసం వినియోగించడానికి కేటాయిస్తారు. శుద్ధి చేసిన మురుగునీటిని తాగునీటి యేతర పనులకు వినియోగించడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చని జలమండలి అధికారులు తెలిపారు.

Green Water Tankers | మొక్కలు, చెట్లకు..

తొలి దశలో జీహెచ్‌ఎంసీ, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు, చెట్లకు శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయాలని ఎండీ ఆదేశించారు. నిర్మాణ రంగ సంస్థలకు కూడా నాణ్యత ప్రమాణాల మేరకు సరఫరా చేయాలని పేర్కొన్నారు. ప్రతి ఎస్టీపీ వద్ద పంపులు, పైపులైన్లు, ఫిల్లింగ్ పాయింట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. 10 వేల, 20 వేల, 30 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లను నమోదు చేసి, గ్రీన్ వాటర్ బ్రాండింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంకర్‌పై ‘తాగడానికి పనికిరాదు’ అనే హెచ్చరిక స్పష్టంగా ఉండాలన్నారు.

దీనిని కూడా చదవండి : TASMAC Liquor Price Hike | మందు బాబులకు షాక్.. నవంబర్ 1 నుంచి రేట్లు పెంపు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *