అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Power Cuts | రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ అభద్రత , సాగునీటి ఎద్దడిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ( Revanth Reddy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాత రోజులు తెస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, నిజంగానే ఆనాటి అంధకారపు కరెంట్ కోతల రోజులను వెనక్కి తీసుకువచ్చారని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం దేవుడెరుగు, కనీసం 6 గంటలు కూడా సక్రమంగా కరెంట్ ఇవ్వలేక ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిందని విమర్శించారు.
Harish Rao Power Cuts | సాకులు చెప్పడం మానుకోవాలి..
కరెంట్ కోతలకు ‘ఎల్ నినో’ ప్రభావమే కారణమంటూ ప్రభుత్వం ఇతరులపై నెపం నెట్టి బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. సాగునీరు, కరెంట్ అందక పంటలు ఎండిపోతుంటే రైతన్నల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పంట పొలాలు ఎండిపోవడంతో కడుపు మండిన మెదక్ జిల్లా రామాయంపేట రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నాకు దిగాల్సిన దుస్థితి ఏర్పడిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Harish Rao Power Cuts | హరీష్ రావు హితవు..
“పరిపాలన అంటే మైకుల ముందు నిలబడి ఉపన్యాసాలు దంచడం కాదు.. సంక్షోభంలో ఉన్న అన్నదాతకు అండగా నిలవడం” అని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. సకాలంలో సాగునీరు, నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించి రైతుల బతుకులను నిలబెట్టడమే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని అన్నారు. ఇప్పటికైనా మాటలు కట్టిపెట్టి వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Kamareddy Municipality | ఫిర్యాదులు.. ఆపై వసూళ్లు..! కామారెడ్డి బల్దియాలో నయా ట్రెండ్‌కు శ్రీకారం