అక్షరటుడే, వెబ్డెస్క్ : Rythu Bharosa Funds | రాష్ట్ర ప్రభుత్వం (State Government) అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలాఖరులోగా రైతు భరోసా జమ చేస్తామని తెలిపింది.
రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. ఎరువులు, విత్తనాలు, ఇతర ధరలు పెరగడంతో రైతులు (Farmers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి సాయం కోసం నిరీక్షిస్తున్నారు. యాసంగి సీజన్లో ప్రభుత్వం ఆలస్యంగా రైతు భరోసా విడుదల చేసింది. అది కూడా రెండు ఎకరాల వరకే నిధులు జమ చేసింది. దీంతో వానాకాలంలోనైనా సకాలంలో డబ్బులు వస్తాయా లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల చివర వరకు రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది.
Rythu Bharosa Funds | ఖమ్మంలో సభ
ఖమ్మం జిల్లా (Khammam District)లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, ఆ సభలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రైతులందరికీ ఒకే విడతలో 9 రోజుల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తామని తెలిపింది. యాసంగి సీజన్లో రెండు ఎకరాల వరకే సహాయం పరిమితం చేయడంపై రైతుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈసారి అందరికి నిధులు వేయడానికి సిద్ధం అవుతోంది. అయితే ఆర్థిక భారం తగ్గించుకోవడానికి ఐదు నుంచి ఏడున్నర ఎకరాల వరకు మాత్రమే గరిష్ట పరిమితి నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Rythu Bharosa Funds | ఆ భూములకు కట్
ప్రస్తుతం సాగులో లేని భూములకు కూడా రైతు భరోసా (Rythu Bharosa) వస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, కాలువలు, బీడు భూములపై కూడా కొందరు డబ్బులు పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం అలాంటి భూములకు నిధులు విడుదలను నిలిపి వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. శాటిలైట్ సర్వే ద్వారా సుమారు 5.50 లక్షల ఎకరాలను గుర్తించి లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిసింది.
Rythu Bharosa Funds | ఒక్కసారి మాత్రమే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే పూర్తిస్థాయిలో రైతు భరోసా జమ చేసింది. తొలిసారి ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేసిన కాంగ్రెస్, తర్వాత సీజన్లో డబ్బులు ఎగ్గొట్టింది. మూడో సారి కేవలం నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమ చేసింది. పోయిన వానాకాలం సీజన్లో మాత్రం పంచాయతీ ఎన్నికలు ఉండటంతో అందరు రైతులకు డబ్బులు జమ చేసింది. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేసింది. అనంతరం యాసింగిలో రెండు ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా వేసింది. అది కూడా పంట కోతలకు వచ్చిన సమయంలో విడుదల చేయడం గమనార్హం. ఈ సారైనా సకాలంలో నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Panipuri Food Poisoning | పానీపూరి తిని 20 మంది చిన్నారులకు అస్వస్థత