అక్షరటుడే, కామారెడ్డి: Harvester Lease Kidnapping | హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తామని నమ్మించి వ్యక్తిని కిడ్నాప్ చేసి రూ.10 లక్షలు డిమాండ్ చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మీడియాకు వెల్లడించారు.
Harvester Lease Kidnapping | కోనాపూర్ గ్రామానికి చెందిన..
కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం మహేష్ వరి కోత హార్వెస్టర్ మిషన్లను లీజుకు తీసుకొని నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డి అనే పేరుతో పరిచయమైన వ్యక్తి హార్వెస్టర్ మిషన్లు లీజుకు ఇస్తానని నమ్మించి గత నెల 22న రాత్రి మాట్లాడుదామని పిలిచి కారులో కిడ్నాప్ చేశాడు. మార్గమధ్యంలో మరో ఇద్దరితో కలిసి బాధితుడి ముఖానికి ఉన్ని టోపీని మాస్క్‌లా వేసి, దాడి చేసి, చంపేస్తామని బెదిరించి అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సులోని రూ.2,500 నగదును బలవంతంగా లాక్కున్నారు. అనంతరం నిందితులు మద్యం సేవించి ఇందల్వాయి వద్ద ఓ ధాబా హోటల్ దగ్గర కారు నిలిపి నిద్రలోకి జారుకున్న సమయంలో బాధితుడు వారి చెర నుంచి తప్పించుకొని ఇందల్వాయి బస్‌స్టాండ్‌కు చేరుకొని గ్రామస్థులకు సమాచారం అందించాడు. అక్కడి నుంచి దోమకొండకు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Harvester Lease Kidnapping | జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు..
జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ కెమెరాల పరిశీలన, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించారు. నిందితులు నిట్టు నర్సింగరావు, ఎరుగు నగేష్, చిందం శ్రీకాంత్ గతంలో జైలులో ఉన్న సమయంలో ఒకరికొకరు పరిచయమై, జైలు నుంచి విడుదలైన తర్వాత సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథకం వేసుకున్నారు. చిందం శ్రీకాంత్‌కు పరిచయమున్న చిందం మహేష్‌ను లక్ష్యంగా ఎంచుకున్నారు.
ఇందులో భాగంగా నర్సింగరావు అనే వ్యక్తి కరుణాకర్ రెడ్డి అనే నకిలీ పేరుతో దొరికిన సిమ్ కార్డు ఉపయోగించి సుమారు నెల రోజుల పాటు మహేష్‌తో మాట్లాడి హార్వెస్టర్ మిషన్లు అద్దెకు ఇస్తామని నమ్మించాడు. నిందితులు ముందుగానే బాధితుడి ఇంటి పరిసరాలు, రాకపోకల మార్గాలను పరిశీలించి మారుతి ఎర్టిగా కారును అద్దెకు తీసుకున్నారు. ఈ పథకంలో ఎరుగు నగేష్, నిట్టు నర్సింగరావు, తెడ్డు సురేష్ ప్రత్యక్షంగా పాల్గొనగా, చిందం శ్రీకాంత్ గ్రామంలోనే ఉండి బాధితుడి కుటుంబ సభ్యుల కదలికలు, పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాలను గమనిస్తూ వారికి సమాచారం అందించే బాధ్యత తీసుకున్నాడు.
Harvester Lease Kidnapping | గత నెల 22న..
గత నెల 22న నిందితులు కారులో కోనాపూర్ గ్రామానికి చేరుకొని హార్వెస్టర్ మిషన్లు చూపిస్తామని చెప్పి మహేష్‌ను కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. కొంతదూరం వెళ్లిన తర్వాత అతడిని ఉన్ని టోపీతో ముఖం కనపడకుండా కప్పి కాళ్లతో తన్నుతూ, చేతులతో కొడుతూ రూ.10 లక్షలు ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్, పర్సు, అందులోని రూ.2,500 నగదును బలవంతంగా లాక్కొని వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ డబ్బులు తెప్పించాలని ఒత్తిడి చేశారు. ఈ ఘటన అనంతరం నిందితులు తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు ఫోన్ చేసి తాము బీహార్‌కు చెందిన వారమని, బాధితుడు తమ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినందున అతడిని తీసుకెళ్లి బెదిరించి వదిలిపెట్టామని తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను, గ్రామస్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. బాధితుడు మొదటిసారి కిడ్నాప్ సమయంలో భయాందోళనకు గురై తనకు ఆడ పిల్లలు ఉన్నారని, తనకు హాని చేయవద్దని, ఎంతైనా డబ్బులు ఇస్తానని చెప్పినందున అతడిని మరోసారి కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని నిందితులు మరోసారి పథకం వేశారు.
Harvester Lease Kidnapping | అదే కారును అద్దెకు తీసుకుని..
ఇందులో భాగంగా నవంబర్ 9న తిరిగి అదే కారును అద్దెకు తీసుకొని కోనాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి వద్ద ఉండగా పోలీసులు కారును అనుమానించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా కిడ్నాప్, దోపిడి బయటపడింది. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన నిట్టు నర్సింగ్ రావు, ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన ఎరుగు నగేష్, తెడ్డు సురేష్, గన్నారం గ్రామం, ఇందల్వాయి, బీబీపేట మండకం కొనాపూర్ గ్రామనికి చెందిన చిందం శ్రీకాంత్‌లను అరెస్ట్ చేసి వారి నుంచి కిడ్నాప్‌కు ఉపయోగించిన తెల్లరంగు ఎర్టిగా కారు, బాధితుడి సెల్‌ఫోన్‌తో పాటు మొత్తం నాలుగు మొబైల్ ఫోన్లు, బాధితుడి ముఖానికి మాస్క్‌లా ఉపయోగించిన ఉన్ని టోపీ, ఒక బైకు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు.
ఇది కూడా చదవండి..: Amrad Fire Accident | అమ్రాద్‌లో అగ్నిప్రమాదం.. స్పందించిన అగ్నిమాపక శాఖ