అక్షరటుడే, వెబ్‌డెస్క్ : HMWS&SB ACB Raid | హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్‌లో గల జలమండలి (HMWS&SB)లో పని చేసే ఓ అధికారి కారులో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. లెక్కల్లో చూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆదివారం వివరాలు వెల్లడించారు.
జలమండలి జాయింట్ డైరెక్టర్ ఎ శ్రీనివాస్ తన కార్యాలయంలో అక్రమంగా సేకరించిన నగదును తీసుకొని ఇంటికి వెళ్తున్నట్లు ఏసీబీ అధికారులకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చెప్పారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయన వెళ్లే మార్గంలో నిఘా పెట్టారు. శనివారం రాత్రి 7 గంటలకు రాజ్‌భవన్ రోడ్డులో గల మెట్రో రెసిడెన్సీ అపార్ట్‌మెంట్స్‌కు ఎదురుగా మారుతి స్విఫ్ట్ కారును ఆపారు. అందులో తనిఖీ చేయగా.. శ్రీనివాస్ వద్ద రూ.2.40 లక్షల లెక్క చూపని నగదు లభ్యమైంది. కార్యాలయం నుంచి తిరిగి వస్తుండగా అంత నగదును కలిగి ఉండటంపై విచారించగా, అతను సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోవడంతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
HMWS&SB ACB Raid | దర్యాప్తు చేస్తున్న అధికారులు
ఆ డబ్బును స్వాధీనం చేసుకున్న అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అవినీతి కోణాన్ని ధృవీకరించడానికి, తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవడానికి నగదును పంచనామా కింద జప్తు చేశామన్నారు. కాగా సదరు అధికారి ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దీనిని కూడా చదవండి : Nagpur Fake Currency | అద్దె చెల్లించలేదని తాళం పగులకొట్టిన యజమాని.. లోపలికి వెళ్లి చూసి షాక్