అక్షరటుడే, కామారెడ్డి: Online Gaming Fraud | వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింక్‌లు పంపి పెట్టుబడుల పేరుతో ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. వీరి మోసాన్ని పసిగట్టిన పోలీసులు వారిని కటకటాల వెనక్కి పంపారు.
Online Gaming Fraud | వాట్సప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింక్‌లు..
ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. వాట్సాప్ ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ లింకులు పంపి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే సమాచారంతో రామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, సీసీఎస్ సీఐ రామన్, రామారెడ్డి ఎస్సై మురళి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశాయి. దర్యాప్తులో భాగంగా కామారెడ్డి బస్టాండ్ వద్ద విశాఖపట్నం వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రధాన నిందితుడు భూక్య నవీన్ అలియాస్ నరేష్ విదేశాల్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న సమయంలో http://Future9.com అనే ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌కు సంబంధించిన వివరాలు, మొబైల్ నంబర్ల డేటాను సేకరించాడు.
Online Gaming Fraud | ఇండియాకు వచ్చిన తర్వాత..
భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత సహ నిందితుడు భూక్య ప్రవీణ్‌తో కలిసి వాట్సాప్ ద్వారా పలువురికి గేమింగ్ లింకులు పంపి పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించారు. బాధితులకు యూజర్ ఐడీలు సృష్టించి వెబ్‌సైట్‌లో డబ్బు జమ చేసేలా ప్రోత్సహించేవారు. నేరుగా చెల్లింపులు జరగని చోట తమ యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా నగదు తీసుకుని ఆ తర్వాత వెబ్‌సైట్‌లో జమ చేసేవారు. దీనికి గాను వారికి 5 శాతం కమిషన్ వచ్చేదని విచారణలో తేలింది. ఈ వెబ్‌సైట్ ద్వారా దేశవ్యాప్తంగా పలువురు మోసపోయినట్లు ప్రాథమికంగా గుర్తించామని ఎస్పీ చెప్పారు. అరెస్టయిన వారిలో రామారెడ్డి మండలానికి చెందిన భూక్య నవీన్ అలియాస్ నరేష్, భూక్య ప్రవీణ్ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.15 వేల నగదు, ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
Online Gaming Fraud | ఇతర రాష్ట్రానికి చెందిన నిందితుడు..
ఈ కేసులో ఇతర రాష్ట్రానికి చెందిన మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలింపు కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, సీసీఎస్ సీఐ రామన్, రామారెడ్డి ఎస్సై మురళి, సైబర్ క్రైమ్ ఎస్సై నరేష్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఆన్‌లైన్ గేమింగ్, పెట్టుబడులు, ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, క్యాష్‌బ్యాక్, రెట్టింపు లాభాల పేరుతో సోషల్ మీడియా, వాట్సాప్, టెలిగ్రామ్‌లో వచ్చే గుర్తు తెలియని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కోరారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే యాప్‌లు, వెబ్‌సైట్లు, వ్యక్తుల మాటలు నమ్మి డబ్బు పంపితే ఆర్థిక మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్‌లో పెట్టుబడి పెట్టే ముందు దాని విశ్వసనీయతను నిర్ధారించుకోవాలని సూచించారు. ఒకవేళ ఆన్‌లైన్ మోసానికి గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేయాలని లేదా http://www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని, అలాగే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే బాధితులు కోల్పోయిన నగదును హోల్డ్ పెట్టి రికవరీ చేసే అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: Hidden Treasure Fraud | గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. అప్పు కింద రంగురాళ్లు అంటగట్టిన కేటుగాడు..!