అక్షరటుడే, కామారెడ్డి: Online Investment Scam | కష్టపడకుండా కూర్చున్న చోటో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా యువత చెడుదారిని ఎంచుకుంటున్నారు. జల్సాలకు అలవాటు పడి బెట్టింగ్ (Betting), ఆన్‌లైన్ గేమింగ్ (Online Investment) ద్వారా అమాయక ప్రజలకు ఎర వేస్తున్నారు. అత్యాశకు పోయి మోసగాళ్ల బారిన పడుతున్నారు అమాయక ప్రజలు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా 7వేలకు పైగా ప్రజలు మోసపోవడం గమనార్హం.
Online Investment Scam | కామారెడ్డి జిల్లా యువకుడు..
కామారెడ్డి (Kamareddy) జిల్లాకు చెందిన ఓ యువకుడు దుబాయిలో ఓ కంపెనీలో పనిచేసి తిరిగొచ్చాడు. అనంతరం ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టించేలా అమాయకులను మోసం చేస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఘటనలో భాగస్వామ్యమై పెట్టుబడి పెట్టిన ప్రజల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Online Investment Scam | అధిక డబ్బుల ఆశ చూపి..
రామారెడ్డి మండలానికి చెందిన బుక్యా నవీన్ అలియాస్ నరేష్ ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పని చేస్తుండగా వారు రూపొందించిన ఆన్‌లైన్ గేమింగ్ యాప్ గురించి పూర్తిగా తెలుసుకున్నాడు. ఉద్యోగం ముగించుకుని స్వదేశానికి తిరిగి వస్తుండగా, ఆ కంపెనీ అతనికి ఒక ఆఫర్ ఇచ్చింది. “మా యాప్‌లో ఇండియాలో పెట్టుబడులు పెట్టించు. ప్రతి పెట్టుబడిపై 5 శాతం కమిషన్ నీకు ఇస్తాం” అని ఒప్పందం కుదుర్చుకుంది. కమిషన్ ఆశతో నవీన్ ఈ ప్రతిపాదనకు ఒప్పుకున్నాడు. అధిక లాభాల పేరుతో ప్రజలను ఆకర్షించేందుకు ఇదంతా ముందే ప్లాన్ చేసిన కుట్రగా పోలీసుల విచారణలో తేలింది.
Online Investment Scam | దుబాయి నుంచి వచ్చి వాట్సాప్ ద్వారా లీడింగ్
ఒప్పందం ప్రకారం దుబాయ్ కంపెనీ నవీన్‌కు అక్కడి కొన్ని సిమ్ కార్డులను ఇచ్చి ఇండియాకు పంపించింది. ఇండియాకు వచ్చిన తర్వాత నవీన్ ఆ విదేశీ సిమ్‌లను ఉపయోగించి వాట్సాప్ ద్వారా ప్రజలకు కాల్స్ చేయడం ప్రారంభించాడు. కంపెనీకి చెందిన feature9.com అనే ఆన్‌లైన్ గేమింగ్ వెబ్ సైట్‌ను తెలిసిన వారితో మొదలుపెట్టి, తెలియని నంబర్లకు కూడా పంపించి వాట్సాప్ మెసేజ్‌లు, కాల్స్ చేసేవాడు. ‘ఈ లింక్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం గ్యారెంటీ’ అంటూ యాప్ లింకులు పంపేవాడు. దుబాయి నుంచి వస్తున్న కాల్ అనే నమ్మకంతో చాలా మంది అతని మాటలను నమ్మారు. ఇలా వాట్సాప్ ద్వారా పెద్ద ఎత్తున లీడింగ్ చేసి ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు.
కమిషన్ కోసం అమాయకులతో ఆటలు
నవీన్ ప్రధాన ఉద్దేశం కమిషన్ సంపాదించడమే. అందుకోసం అమాయక ప్రజలతో ఆటలు ఆడాడు. మొదట చిన్న మొత్తం పెట్టుబడి పెట్టిన కొందరికి తిరిగి కొంత మొత్తం ఇచ్చి నమ్మకం కలిగించాడు. ఆ తర్వాత పెద్ద మొత్తాలు పెట్టేలా ఒత్తిడి చేశాడు. ప్రజలు రూ.వెయ్యి నుంచి మొదలుకుని రూ.7 వేల వరకు ఆ యాప్‌లో పెట్టుబడి పెట్టారు. వారు చెల్లించిన డబ్బు మొత్తం ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా నేరుగా దుబాయ్‌లోని కంపెనీ అకౌంట్‌లోకి వెళ్లిపోయేది. ప్రతి ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే కంపెనీ నవీన్‌కు 5శాతం కమిషన్‌ను తిరిగి పంపేది. ఈ విధంగా అతను కమిషన్ రూపంలో భారీగా డబ్బు సంపాదించాడు.
మోసపోయిన 7 వేల పైచిలుకు బాధితులు
ఇలా నవీన్ ద్వారా మొత్తం 7,633 మంది ప్రజలు ఆ యాప్‌లో పెట్టుబడులు పెట్టారు. మొదట్లో లాభాలు వస్తాయని ఆశపడ్డ బాధితులకు ఆ తర్వాత అసలు డబ్బే తిరిగి రాలేదు. యాప్ నుంచి ఎలాంటి రిటర్న్ రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఇప్పటికే బయటకు వచ్చిన బాధితుల సంఖ్య 7 వేలకు పైగా ఉండగా, ఇంకా ఫిర్యాదు చేయని వారు కూడా ఉన్నందున బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
– రాజేష్ చంద్ర, ఎస్పీ కామారెడ్డి
ప్రజలు ఆన్‌లైన్ పెట్టుబడుల జోలికి వెళ్లే ముందు పూర్తిగా ఆలోచించాలి. అత్యాశకు పోయి మోసపోవద్దు. తెలియని లింకులు, విదేశీ నంబర్ల నుంచి వచ్చే ఆఫర్లను నమ్మవద్దు. అనుమానం వస్తే వెంటనే సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలి. గేమింగ్, బెట్టింగ్ యాప్స్, ఇతర ఆఫర్లకు సంబంధించిన లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఇది కూడా చదవండి: Hidden Treasure Fraud | గుప్తనిధుల పేరుతో ఘరానా మోసం.. అప్పు కింద రంగురాళ్లు అంటగట్టిన కేటుగాడు..!