అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat Secretary Bribery | మరో అవినీతి అధికారి ఏసీబీ (ACB) వలకు చిక్కాడు. ఇంటి అనుమతి కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఖమ్మం (Khamma) జిల్లా ముదిగొండ మండలం భానాపురం పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ శనివారం ఏసీబీకి చిక్కాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకున్న 5 గుంటల స్థలంలో ఒక గది, రేకుల షెడ్ నిర్మిస్తున్నాడు. దీనికి అనుమతి ఇవ్వడంతో పాటు, ఇంటి నంబర్ కేటాయించడానికి పంచాయతీ కార్యదర్శి సురేశ్ రూ.25 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శనివారం గ్రామంలోని రైతు వేదిక వద్ద ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా.. జీపీ సెక్రెటరీ సురేశ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని వరంగల్ ACB కోర్టులో హాజరు పరిచారు.
Panchayat Secretary Bribery | జోరుగా అవినీతి
రాష్ట్రంలోని పలువురు పంచాయతీ కార్యదర్శులు భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో పాటు ఇతర నిర్మాణాలు సైతం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఇంటి పర్మిషన్ కోసం అని భారీగా దండుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే పనులు ఆపేస్తామని, నోటీసులు పంపుతామని బెదిరిస్తున్నారు.
పర్మిషన్ కోసం ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బులతో పాటు అదనంగా వసూలు చేస్తున్నారు. పలు గ్రామాల్లో వీరికి కారోబార్లు సాయం చేస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల కోసం కూడా కొందరు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే పంచాయతీకి సంబంధించిన ఇతర బిల్లుల విషయంలో కూడా కార్యదర్శులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
దీనిని కూడా చదవండి : VIP Security Reduction | ప్రభుత్వం కీలక నిర్ణయం.. వీఐపీల సెక్యూరిటీ తగ్గింపు