Pension Collection Scam | ‘పింఛన్’ వసూళ్లకు చెక్.. ‘అక్షరటుడే’ కథనానికి స్పందించిన కామారెడ్డి బల్దియా

నిరుపేదలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. అయితే కామారెడ్డి బల్దియా పరిధిలో దరఖాస్తుదారుల నుంచి కొందరు పింఛన్ల పేరుతో అందినంత దోచుకుంటున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Pension Collection Scam | నిరుపేదలకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ‘చేయూత’ పింఛన్లు అందిస్తోంది. అయితే కామారెడ్డి బల్దియా పరిధిలో దరఖాస్తుదారుల నుంచి మున్సిపల్​ సిబ్బంది పింఛన్ల పేరుతో అందినంత దోచుకుంటున్నారు. ఈ వసూళ్ల దందాపై ‘అక్షరటుడే’లో ఈనెల 8న ‘పింఛన్ కోసం పైసలియ్యాల్సిందే’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు వసూళ్లకు చెక్ పెట్టే దిశగా చర్యలు చేపట్టారు.

Pension Collection Scam | కామారెడ్డి మున్సిపాలిటీలో..

కామారెడ్డి (Kamareddy) మున్సిపాలిటీలో జీతాలు, పన్ను వసూళ్లు, టెండర్లు మొదలు చిన్న పనుల వరకు చేయి తడపనిదే పని జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిని కూడా వదలడం లేదు. కొందరు దళారులు సిబ్బందితో కుమ్మక్కై ‘మేము అన్నీ చూసుకుంటాం, పింఛన్ ఇప్పిస్తాం’ అంటూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ‘అక్షరటుడే’ వెలుగులోకి తెచ్చింది. కథనంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే వార్డుల వారీగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేశారు. ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా, నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులను గుర్తించాలని సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Pension Collection Scam | సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు

ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న సేవలను సైతం అక్రమార్కులు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకుంటున్నారన్న విమర్శలున్నాయి. అమాయక లబ్ధిదారుల నుంచి రూ.2వేల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారని ‘అక్షరటుడే’ బయటపెట్టింది. ఈ కథనం జిల్లాలో చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆదేశించారు. వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో పారదర్శకత కోసం అధికారులు కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటివరకు కార్యాలయానికే పరిమితమైన దరఖాస్తుల పరిశీలనను ఇకపై క్షేత్రస్థాయిలో చేపట్టాలని నిర్ణయించారు. వార్డుల వారీగా బృందాలను ఏర్పాటు చేసి, నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను పరిశీలిస్తున్నారు. దళారుల ప్రమేయం లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో, ఫొటోలతో డాక్యుమెంట్ చేస్తున్నారు.

Pension Collection Scam | ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచన

పింఛన్ కోసం ఎవరైనా డబ్బులు అడిగితే భయపడవద్దని, వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని మున్సిపల్ ఛైర్​పర్సన్​, కమిషనర్ ప్రజలకు సూచించారు. దీని కోసం బల్దియా కార్యాలయంలో ప్రత్యేక ఫిర్యాదు నంబర్​ను అందుబాటులో ఉంచారు. అర్హత ఉంటే ఎవరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఉచితంగా పింఛన్లను అందిస్తోందని స్పష్టం చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.

Pension Collection Scam | సిబ్బంది ప్రమేయం ఉంటే కఠిన చర్యలు

ఈ వసూళ్ల దందాలో మున్సిపల్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలితే ఉపేక్షించేది లేదని అధికారులు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే కొందరు అనుమానిత సిబ్బందిని గుర్తించినట్లు సమాచారం. విచారణలో దోషులుగా తేలితే చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మధ్యవర్తుల ద్వారా సిబ్బంది వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టంగా పేర్కొన్నారు.

Pension Collection Scam | దళారులను నమ్మి మోసపోవద్దు.. – ఇప్ప ఉమారాణి, ఛైర్​పర్సన్​

పేద ప్రజలకు పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియపై బల్దియా ఉచిత సేవలు అందిస్తోంది. ఎలాంటి అనుమానం ఉన్నా కార్యాలయంలో సిబ్బంది ద్వారా నివృత్తి చేసుకోవాలి. పింఛన్లు ఇప్పిస్తామని దళారులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దు. పింఛన్ల కోసం ఎవరు కూడా ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నాతో పాటు కమిషనర్ కు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

ఇది కూడా చదవండి..: Illegal Building Demolition | అనుమతి లేకుంటే భవనాలు కూల్చివేస్తాం: మున్సిపల్ కమిషనర్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *