అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rice Millers Scam | సన్న బియ్యానికి బదులుగా ఎఫ్‌సీఐ (FCI)కి దొడ్డు బియ్యం సరఫరా చేసిన మిల్లులపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. నాణ్యమైన సన్న బియ్యాన్ని దారి మళ్లించి, తక్కువ ధర పలికే దొడ్డు బియ్యాన్ని పలువురు మిల్లర్లు ఎఫ్‌సీఐకి అంటగట్టారు.
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌సీఐకి 59.60 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా ఇవ్వడానికి ప్రభుత్వం 2025-26 ఖరీఫ్ సీజన్ ల 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. కొంతమంది రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన సన్న రకం వరిని బహిరంగ మార్కెట్‌కు మళ్లించి, దాని స్థానంలో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించిన దొడ్డు బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించారు.
Rice Millers Scam | 16 మిల్లుల్లో..
నిజామాబాద్ (Nizamabad), కరీంనగర్, ములుగు జిల్లాల్లోని 16 రైస్ మిల్లులు సన్నా రకం కేటాయింపులకు బదులుగా 3,385.820 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యాన్ని సరఫరా చేశాయి. దీంతో ప్రభుత్వానికి కేవలం బోనస్ రూపంలోనే సుమారుగా రూ. 1.69 కోట్లు నష్టం వాటిల్లింది. దీంతో అధికారులు మిల్లుల్లో తనిఖీలు చేశారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. మూడు క్రిమినల్ కేసులు నమోదు చేసి, 14 మంది మిల్లు యజమానులను అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆరుగురిపై కేసు నమోదు చేయగా.. లాబిశెట్టి శ్రీకాంత్, లాబిశెట్టి గంగ ప్రసాద్, పాకాల అంజయ్య, బొందుగుల దేవేందర్‌ను అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో మిల్లు యజమానులు, అధికారులు, ఇతరుల పాత్రపై సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
Rice Millers Scam | సన్నాల సాగు పెరగడంతో..
రాష్ట్రంలో గతంలో సన్నాల సాగు తక్కువగా ఉండేది. ఆ ధాన్యాన్ని సైతం ఎక్కువ శాతం దళారులే కొనుగోలు చేసేవారు. అయితే ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించిన తర్వాత సాగు విస్తీర్ణం పెరిగింది. అంతేగాకుండా బోనస్ కోసం ప్రజలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. దొడ్డు రకాలు, సన్నాలను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మిల్లులకు కేటాయిస్తోంది. అయితే సన్నాలను కొందరు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దానిస్థానంలో దొడ్డు బియ్యం, పాలిష్ చేసిన దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సీఐడీ కేసులు నమోదు చేసింది.
దీనిని కూడా చదవండి : RTC Weekly Pass | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రూ.600లకే వారం పాస్