అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Fee Reimbursement | తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏటా చెల్లించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) ప్రకటించారు. భవిష్యత్తులో ఈ విషయంలో ఎలాంటి బకాయిల సమస్య ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక అంశాలపై స్పందించారు.
Telangana Fee Reimbursement | బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను దుర్వినియోగం చేయాలని చూసిన సంస్థలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని సీఎం తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన రూ.8 వేల కోట్ల బకాయిలు తమ ప్రభుత్వంపై అదనపు భారాన్ని మోపాయన్నారు. తాము ఈ బకాయిలు చెల్లించడం లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై పదే పదే ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు రామచందర్ రావు, ఆర్. కృష్ణయ్యలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్. కృష్ణయ్య తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిల గురించి మాట్లాడకుండా, కేవలం తెలంగాణపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు.
Telangana Fee Reimbursement | విద్యావ్యవస్థ ప్రక్షాళన..
ఆఫ్‌లైన్‌లో పరీక్షల నిర్వహణలో వస్తున్న సమస్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యురంగంపై కేంద్రం ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తోందని, విద్య సాధ్యమైనంత వరకు రాష్ట్ర పరిధిలోనే ఉంటే తప్పులు జరగకుండా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో గ్లోబరీనా లాంటి సంస్థలు పాల్పడిన అక్రమాలపై అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లే ఆ సంస్థ సీబీఎస్‌ఈకి కూడా విస్తరించిందని ఆరోపించారు. కేంద్ర చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర విద్యావ్యవస్థలో ప్రక్షాళన చేపడతామని హామీ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, పారదర్శక పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో విశ్వాసం పెంచుతున్నామని ఆయన గుర్తుచేశారు.
Telangana Fee Reimbursement | కేంద్రమంత్రితో భేటీ..
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖల మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) 2.0 కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని కేంద్రమంత్రికి వివరించారు. అలాగే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో (MGNREGS) రైతుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు వీలుగా పశుగ్రాసం, కూరగాయల పందిళ్లు, మల్బరీ తోటల పెంపకం వంటి అదనపు పనులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఉపాధి హామీ కిందకు తీసుకువచ్చి లబ్ధిదారులకు 90 రోజుల పని కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎంపీలు కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Podu Land | పోడు భూమిలో చెట్లు నాటిన అధికారులు.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం