అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mahesh Kumar Goud | జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తాము కేవలం ఒక సినిమా నటుడిగానే చూస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తి తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి ఇక్కడి ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేరని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Mahesh Kumar Goud | ఆంధ్రా నేతకు ఆంధ్రాపైనే ప్రేమ..
ప్రాంతీయ సెంటిమెంట్‌ను ప్రస్తావిస్తూ మహేశ్ కుమార్ గౌడ్ పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. “ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకుడికి ఎప్పుడైనా సరే ఆంధ్రా ప్రాంతం మీదనే ప్రేమ ఉంటుంది. అలాంటి వారు తెలంగాణలో రాజకీయాలు చేస్తే ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ఎలా నెరవేరుస్తారు?” అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలో రాజకీయంగా ఎలాంటి స్థానం లేదనే అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యానించారు.
Mahesh Kumar Goud | రాజకీయాలు వేరు
ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌కు తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న స్వామితో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధంపై కూడా పీసీసీ చీఫ్ స్పందించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి అందరికీ ఆరాధ్య దైవమని, అదేవిధంగా పవన్ కళ్యాణ్‌కు కూడా కొండగట్టు అంజన్న ఇష్ట దైవమని పేర్కొన్నారు. దేవుడిని దర్శించుకోవడం వేరని, ఇక్కడ రాజకీయాలు చేయడం వేరని పేర్కొంటూ.. ఆధ్యాత్మికతను, రాజకీయాలను ముడిపెట్టలేమని అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ ను సినిమా యాక్టర్ గానే చూస్తాం
ఆంధ్రా మూలాలు ఉన్న వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టీ తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యలేడు
ఆంధ్రా ప్రాంత నాయకుడికి ఆంధ్రా మీదనే ప్రేమ ఉంటుంది
కొండగట్టు అంజన్న స్వామీ అందరికీ ఆరాధ్య దైవం అదేవిధంగా పవన్ కి కూడా ఇష్ట దైవం
-మహేష్ కుమార్… pic.twitter.com/nzw63GUeme
— BIG TV Breaking News (@bigtvtelugu) June 2, 2026
ఇది కూడా చదవండి: Cooler Electric Shock | ప్రాణం తీసిన కూలర్.. తండ్రీకొడుకుల మృతి


