అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR Padayatra | కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ (Somajiguda Press Club)లో మాట్లాడారు.
రాష్ట్రంలో వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తానని కేటీఆర్ తెలిపారు.ఎప్పుడు చేయలనేది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది పార్టీలో నిర్ణయించి చెబుతామని తెలిపారు. ‘మా గుర్తు కారు మాకు ఎప్పుడు గేర్ మార్చాలో తెలుసు. రేవంత్ రెడ్డి స్థాయికి మేము చాలు.. మా నాయకుడు కేసీఆర్ అవసరం లేదు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
KTR Padayatra | అప్పులపై అబద్ధాలు

మాట్లాడితే కేసీఆర్ (KCR) అప్పు చేసి పోయాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై ఒక్కో మంత్రి ఒక్కో లెక్క చెబుతున్నారని విమర్శించారు. కేబినెట్‌లో మంత్రులకు శృతి లేదు, లయ లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రూ.2.80 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని వెల్లడించారు. కాంగ్రెస్ మంత్రులు మాత్రం రూ.పది లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లలో కాంగ్రెస్ రూ.4 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. భూముల వేలంలో ఎకరం రూ.200 కోట్లకు పోతుందని, ఆ డబ్బులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
KTR Padayatra | రాజకీయాల నుంచి తప్పుకుంటా
కేసీఆర్ తెలంగాణలో ఆర్థిక విప్లవం తీసుకొచ్చారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాధించిన ప్రగతి కంటే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ ప్రగతి జరిగిందా అని ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో ప్రగతి జరిగిందని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు సవాల్ విసిరారు. సీఎం పదేపదే తొక్కుకుంటూ వచ్చానని అంటారని, ఆయన నిజంగానే తెలంగాణ ఆర్థిక పరిస్థితిని తొక్కేశారని విమర్శించారు.
KTR Padayatra | అందుకే అహంకారం అంటారేమో..

తనకు అహంకారం ఎక్కువ అని జరిగే ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. అది తన బాడీ లాంగ్వేజ్ సమస్య అని, ‘మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్’ కావచ్చునని వ్యాఖ్యానించారు. తనకు లేని నవ్వులు నటించడం రాదని, నిఖార్సైన నిజాలు మాట్లాడతానని చెప్పారు. అందుకే కొందరు అహంకారం అంటారేమో అన్నారు. తాను ఎక్కడ అహంకారం చూపించానో ఎవరూ నిరూపించలేరని, ఈ విమర్శలు తనకు అలవాటైపోయాయని పేర్కొన్నారు.
KTR Padayatra | పొత్తులపై..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని వచ్చే వార్తలను కేటీఆర్ ఖండించారు. ఒంటరిగా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. తన పరిధి చిన్నదని, తాను తెలంగాణలోనే ఉంటానని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని అనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పరిపాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ డ్రామా చేస్తున్నారన్నారు.
ఇది కూడా చదవండి..: KTR Counter to Pawan | తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
