అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kamareddy Theft | పెళ్లి వేడుకకు హాజరైన ఓ యువతి బ్యాగులోని బంగారు ఆభరణాలను చోరీ చేసిన కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ మధుసూదన్ తెలిపారు.
Kamareddy Theft | జిప్ తెరిచి ఉండటంతో..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లాకు చెందిన వోలెల్ల నందిని ఈ నెల 29న కామారెడ్డి పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలోని వైశ్య భవన్‌లో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యారు.
ఉదయం 9.30 గంటల సమయంలో తన బ్యాగును భవన్‌లోని ఒక గదిలో ఉంచారు. ఆ బ్యాగులో దాదాపు 12 గ్రాముల బంగారు చెవి దిద్దులు, బంగారు గొలుసు, దుస్తులు ఉన్నాయి.
సాయంత్రం 3 గంటల సమయంలో బ్యాగును పరిశీలించగా జిప్ తెరిచి ఉండటంతో పాటు అందులోని బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Kamareddy Theft | సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో
సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు డ్రైవర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మొహమ్మద్ అఫ్సర్ అలీని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.
విచారణలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ చోరీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు. గతంలో జైలు శిక్ష అనుభవించి విడుదలైన అనంతరం ఆర్థిక సమస్యలు కొనసాగడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వైశ్య భవన్‌లో ఉన్న బ్యాగును లక్ష్యంగా చేసుకుని చోరీ చేసినట్లు వెల్లడించినట్లు చెప్పారు.
నిందితుడి నుంచి చోరీకి గురైన 12 గ్రాముల బంగారు చెవి దిద్దులు, బంగారు గొలుసును స్వాధీనం చేసుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు.
ఈ వివరాలను వెల్లడించిన మీడియా సమావేశంలో టౌన్ సీఐ నరహరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
