అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DSP Bheem Reddy Arrest | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ (ACB) అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. ఇటీవల ఆయన ఇళ్లతో పాటు బంధువుల నివాసాల్లో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పని చేసిన భీం రెడ్డి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఆయన డీజీపీ ఆఫీస్‌లోని కంప్యూటర్ సర్వీసెస్‌లో పని చేస్తున్నారు. దీంతో ఈ నెల 2న ఏసీబీ అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.300 కోట్ల విలువైన ఆదాయానికి మించిన అక్రమాస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది. సోదాల్లో లభించిన ఆధారాలు, పత్రాల పరిశీలన అనంతరం భీమ్‌రెడ్డిని అధికారులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
DSP Bheem Reddy Arrest | అక్రమాస్తుల వివరాలు..
భీమ్‌రెడ్డి తన సర్వీస్ కాలంలో అవినీతి, అక్రమ మార్గాల ద్వారా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టాడు. ఇబ్రహీంబాగ్‌లోని వెస్సెల్లా మెడోస్‌లో ఒక విలాసవంతమైన విల్లా, టెలికాం నగర్లో ఒక G+2+పెంట్ హౌస్ నివాసం, టెలికాం నగర్‌లోని సాయి ప్రభా రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలోని క్రాంతి సియాన్ అపార్ట్‌మెంట్స్‌లో ఒక ఫ్లాట్, తెల్లాపూర్‌లోని అభినంద రెసిడెన్సీలో రెండు నివాస ఫ్లాట్లు ఉన్నాయి.
మణికొండ ల్యాంకో హిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న G+5 కమర్షియల్ కాంప్లెక్స్‌లో వాటా, మణికొండ మర్రిచెట్టు జంక్షన్ సమీపంలో 3000 చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్, ప్రగతి రిసార్ట్స్‌లో 500 చదరపు గజాల ఓపెన్ ప్లాట్, నాగోలు కామినేని హాస్పిటల్ సమీపంలో 200 చదరపు గజాల ప్లాట్, పటాన్చెరు జీపీఆర్ హౌసింగ్ సొసైటీ సమీపంలో 400 చదరపు గజాల ప్లాట్, పటాన్చెరులో మరొక 200 చదరపు గజాల ఓపెన్ ప్లాట్ డీఎస్పీ భీమ్‌రెడ్డి సంపాదించాడు.
DSP Bheem Reddy Arrest | వ్యవసాయ భూమి
సంగారెడ్డి జహీరాబాద్‌లో 3.5 ఎకరాలు వ్యవసాయ భూమి, వికారాబాద్ మోమిన్‌పేటలో 2 ఎకరాలు, ముచ్చింతలలో 4 ఎకరాల 20 గుంటలు, కర్ణాటకలో 45 ఎకరాల వ్యవసాయ భూమిని ఆయన కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గతంలో తెలిపారు.
దీనిని కూడా చదవండి : Cheriyal Tahsildar Bribery | రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్