అక్షరటుడే, వెబ్‌డెస్క్: Last Mile Connectivity| లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న విధానాలు ఆటో డ్రైవర్ల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణ పథకం కారణంగా ఆటో డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయని, ఇప్పుడు ఈవీ ఆటోలను ప్రభుత్వం ప్రవేశపెట్టి స్వయంగా నడపాలని యోచించడం వారి పొట్టకొట్టే చర్యేనని విమర్శించారు.
Last Mile Connectivity | తగ్గిన ఆటో డ్రైవర్ల ఆదాయం
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రయాణికులు తాము దిగాల్సిన స్టేజీకి చేరుకున్న తర్వాత అవసరమైతే ప్రైవేట్ ఆటోలను బుక్ చేసుకునే అవకాశం ఉందని, అలాంటి సేవలను కూడా ప్రభుత్వమే నిర్వహించాలనుకోవడం సమంజసం కాదని ఆమె అన్నారు.
ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, చాలా మంది నెలవారీ ఈఎంఐలు కూడా చెల్లించలేని క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కవిత పేర్కొన్నారు.
ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఈవీ ఆటోల పేరుతో పెద్ద ఎత్తున వాహనాలను ప్రవేశపెట్టి స్వయంగా సేవలు అందించాలనే నిర్ణయం తీసుకుంటే, వేలాది మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు మరింత ఆర్థిక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని, వారి ఉపాధికి భంగం కలిగించే విధానాలను పునఃసమీక్షించాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మికుల జీవనోపాధిని కాపాడేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.