అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Social Justice | సమాజంలో వనరులు అందరికీ సమానంగా అందాలనేదే మనందరి ఆలోచన కావాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘సామాజిక న్యాయం – తెలంగాణ సంకల్ప సభ’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సామాజిక న్యాయం అనగానే అగ్రవర్ణాలకు వ్యతిరేకం అనుకుంటారు కానీ, వనరులను అందరూ సమానంగా పంచుకోవడమే అసలైన సామాజిక న్యాయమని ఆమె స్పష్టం చేశారు. వంద మందికి వంద రొట్టెలు ఉంటే అందరూ సమానంగా తినడం న్యాయమని, కానీ పది మంది బలవంతులు 90 రొట్టెలు తింటూ.. 90 మంది బలహీనులు కేవలం 10 రొట్టెలే తింటుంటే అది న్యాయమా అని ప్రశ్నించారు. ఈ విషయంలో అగ్రవర్ణ మిత్రులు ఒక్కసారి పునరాలోచించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు.
Kavitha Social Justice | కుల వివక్ష ఇంకా తొలగిపోలేదు..
గౌతమ బుద్ధుడు, సాహూ మహారాజ్ స్ఫూర్తితో అగ్రవర్ణ మిత్రులు సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని కవిత పిలుపునిచ్చారు. ‘దున్నేవాడిదే భూమి’ నినాదంతో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు కొంతమేర అడుగు పడినప్పటికీ.. సామాజికంగా, కుల వివక్షపై జరగాల్సిన పోరాటాలు ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు. అందుకే తెలంగాణలో నేటికీ కుల వివక్ష, సామాజిక అన్యాయం కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Kavitha Social Justice | నాకేం సంబంధం అంటే ఎలా?
సామాజిక న్యాయంతో నాకేం సంబంధం అని కొంతమంది మాట్లాడుతున్నారని, అలాంటివారు చెవులు విప్పి వినాలన్నారు. తాను అగ్రవర్ణంలో పుట్టడం తన చేతుల్లో లేదని, కానీ ఎలా జీవించాలి, ఎవరి కోసం పనిచేయాలి అనేది తన చేతుల్లోనే ఉందన్నారు. అణగారిన వర్గాల కోసం, కనీసం వార్డు మెంబర్ కూడా కాలేకపోయిన కులాలతో కలిసి పనిచేస్తూ.. వారికి సాధికారత చేకూర్చే వరకు తన జీవితాన్ని అంకితం చేస్తానని స్పష్టం చేశారు. విదేశాల్లో మన వారిపై వివక్ష చూపిస్తే ‘రేసిజం’ అంటున్నామని, మరి మన పక్కనే ఉన్న కుల వివక్షను ఎందుకు తుడిచివేయలేకపోతున్నామని నిలదీశారు.
Kavitha Social Justice | ప్రభుత్వాలపై విమర్శలు..
స్వాతంత్రం వచ్చిన నాడే ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీలకూ రిజర్వేషన్లు ఇస్తే, మన దేశం ఎప్పుడో అమెరికాతో పోటీపడేదని కవిత అభిప్రాయపడ్డారు. బ్యాక్లాగ్ ఉన్న ప్రతి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగాన్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 56 శాతం బీసీ జనాభా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 42 శాతం బిల్లు పెట్టిందని విమర్శించారు. ఈ బిల్లును రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో పెట్టి, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి మాత్రం ప్రేమలేఖలు రాసుకుంటున్నారని మండిపడ్డారు.
Kavitha Social Justice | Kavitha Social Justice |సభలో కీలక తీర్మానాలు..
ఈ సామాజిక న్యాయ సంకల్ప సభలో కవిత పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అలాగే, దేశానికి అమూల్యమైన సేవలు అందించిన జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు ‘భారతరత్న’ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌కు ‘పద్మవిభూషణ్’ పురస్కారం ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని ఆమె తీర్మానించారు.
మన పుట్టుక మన చేతిలో ఉండదు…⁰కానీ ఎలా జీవించాలి, ఏ విలువలతో ముందుకు సాగాలి, సమాజం కోసం ఎలా పని చేయాలి అనేది మనమే నిర్ణయించుకుంటాం✊
– కల్వకుంట్ల కవితక్క, TRS చీఫ్#TRS4SocialJustice#Kavithakka4SocialJustice pic.twitter.com/lfk4LhBILo
— Telangana Rakshana Sena (@TRS_Connects) August 6, 2026
ఇది కూడా చదవండి: GPO ACB Trap | రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన జీపీవో