అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Tahsildar Office | కామారెడ్డి (Kamareddy) తహశీల్ కార్యాలయం తరలింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలోనే న్యాయస్థానానికి చెందిన రెండు కొత్త బెంచ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో తహశీల్ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Kamareddy Tahsildar Office | స్థలాభావం కారణంగా..
గతంలో ఈ భవనంలోనే న్యాయస్థానం కొనసాగేది. తర్వాత కోర్టు కొత్త భవన సముదాయంలోకి మారింది. ఇప్పుడు అదనంగా మరో రెండు బెంచ్‌లు మంజూరు కావడంతో స్థలాభావం ఏర్పడింది. దీంతో పాత భవనంలోనే కొత్త బెంచ్‌లు ఏర్పాటు చేయాలని న్యాయశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయాన్ని మరోచోటికి మార్చాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని జీవీఎస్ కళాశాల భవనంలోకి తహశీల్ కార్యాలయాన్ని తరలించే యోచనలో ఉన్నట్లు సమాచారం. దానితో పాటు ఇతర భవనాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు. కార్యాలయాన్ని ఈనెల 25లోపు షిఫ్ట్ చేయాలని ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రెవెన్యూ రికార్డుల భద్రత, రిజిస్ట్రేషన్ల నిర్వహణ, ఆన్లైన్ నెట్వర్క్, మౌలిక వసతుల కల్పనపై రెవెన్యూ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
Kamareddy Tahsildar Office | ఇబ్బందులు తప్పవని భావించి..
హడావుడిగా మారిస్తే ప్రజలకు ఇబ్బందులు తప్పవని భావించి మూడు నెలల గడువు కోరినట్లు సమాచారం. మరోవైపు తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ప్రస్తుత భవనం వద్ద అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. కార్యాలయం పక్కనే ఆన్లైన్ సెంటర్లు, జిరాక్స్ షాపులు ఉండటంతో దరఖాస్తులు, జిరాక్స్ పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. పక్కనే కోర్టు ఉండటంతో అవసరమైన నోటరీ కూడా న్యాయవాదుల వద్ద వెంటనే చేసుకునే అవకాశం ఉంది. కార్యాలయాన్ని దూర ప్రాంతానికి తరలిస్తే ప్రతి చిన్నపనికి కిలోమీటర్ దూరంలో ఉండే జిరాక్స్, ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Kamareddy Tahsildar Office | షిఫ్టింగ్ మరికొన్ని రోజులు ఆపే ప్రయత్నం..
కొందరు జిరాక్స్, ఆన్లైన్ సెంటర్లలో తిష్ట వేసి దళారీ వ్యవహారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కార్యాలయం తరలిస్తే తమ ఆదాయానికి భారీగా గండి పడుతుందని సదరు బ్రోకర్లు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తమకు అనుకూలంగా పనులు చేసిపెట్టే అధికారులతో షిఫ్టింగ్‌ను మరికొన్ని రోజులు వాయిదా వేయాలని అభ్యర్థిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఉన్న తహశీల్దార్ కార్యాలయం సైతం శిథిలావస్థకు చేరుకుంది. వర్షం పడితే పైన గదుల్లో రికార్డులు తడిసిపోతున్నాయి. వాటిని కాపాడుకోలేక అధికారులు అవస్థలు పడుతున్నారు. వర్షం పడితే కార్యాలయంలో కూడా అక్కడక్కడా వర్షపు నీరు చేరుతోంది. దాంతో కొత్త భవనం కోసం కూడా రెవిన్యూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి..: Nizamabad POCSO Case | బాలికపై లైంగికదాడి.. నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష