అక్షరటుడే, బాన్సువాడ : Banswada Police | ఓ మహిళ ఇద్దరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని వారితో కలిసి తన భర్తను హత్య చేయించింది. ఈ ఘటన బాన్సువాడ (Banswada) మండలంలో చోటు చేసుకుంది.
బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి శుక్రవారం కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ రాత్రి హన్మాజీపేట్ గ్రామ శివారులోని పచ్చేరు చెరువు వద్ద చాకలి అలియాస్ గుమ్మడి కాశీరాం (26) హత్యకు గురయ్యాడు. మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు డీఎస్పీ విఠల్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి స్థానిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
Banswada Police | మద్యం తాగేందుకు తీసుకెళ్లి..
కాశీరాం భార్య గుమ్మడి సవితకు చింతకింది రాము, పసుపుల సంతోష్ అనే వ్యక్తులతో వివాహేతర సంబంధం ఉంది. దీంతో తన భర్తను హత్య చయాలని పథకం రూపొందించింది. పథకం ప్రకారం 23వ తేదీ రాత్రి కాశీరాంను మద్యం తాగేందుకు సంతోష్, రాము తీసుకెళ్లారు. అతను మత్తులో ఉన్న సమయంలో రాము నైలాన్ తాడుతో మెడ బిగించి హత్య చేయగా, సంతోష్ అతను తప్పించుకోకుండా చేతులను గట్టిగా పట్టుకుని సహకరించాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడవేసి ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ కుట్రలో భార్య సవిత కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. హన్మాజీపేట్ గ్రామంలో ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని విచారించగా.. నేరం అంగీకరించినట్లు డీఎస్పీ తెలిపారు.
దీనిని కూడా చదవండి : Narsingpalli Suspicious Death | నర్సింగ్‌పల్లి గుట్టల్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..