Drug Peddler Arrest | డ్రగ్స్​ మత్తులో పోలీసులను కారుతో ఢీకొన్న యువకుడు

డ్రగ్స్​ మత్తులో ఓ యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించాడు ఈ ఘటనలో కానిస్టేబుల్ కాలు విరిగింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drug Peddler Arrest | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో దారుణం చోటు చేసుకుంది. డ్రగ్స్​ మత్తులో ఓ యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్​, సీఐ గాయపడ్డారు.

నగరంలోని అబిడ్స్​లో డ్రగ్స్​ విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో నార్కోటిక్స్​ ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు నిఘా పెట్టారు. డ్రగ్స్ పెడ్లర్ కారులో అబిడ్స్‌లోని పాయల్ ఫుట్‌వేర్ వద్దకు వచ్చి సరఫరా చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నిందితుడు కారును పక్కకు తీస్తున్నట్లు నటించాడు. అనంతరం పోలీసులపైకి కారు ఎక్కించి పరారయ్యాడు.

Drug Peddler Arrest | హత్యా యత్నం కేసు నమోదు

నిందితుడు కారు ఎక్కించడంతో కానిస్టేబుల్ మహేందర్‌కు కాలు విరిగింది. అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్న నిందితుడిని అఫ్జల్‌గంజ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని వెంబడించి పట్టుకునే సమయంలో ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, మరో కానిస్టేబుల్ వంశీధర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. డ్రగ్స్ పెడ్లర్‌ను హుస్సేనీ ఆలం‌కు చెందిన సైఫ్‌గా పోలీసులు గుర్తించారు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ మహేందర్‌ను పోలీసులు యశోద ఆసుపత్రికి తరలించారు.

Drug Peddler Arrest | రెచ్చిపోతున్న డ్రగ్స్​ ముఠాలు

రాష్ట్రంలో డ్రగ్స్​ దందా జోరుగా సాగుతోంది. డ్రగ్స్​ ముఠాలు గంజాయి, ఇతర డ్రగ్స్​ విక్రయాలు చేపడుతున్నారు. పోలీసులు తనిఖీలు చేపడుతున్నా.. వీరి దందా మాత్రం ఆపడం లేదు. డ్రగ్స్​కు బానిసలుగా మారి విద్యార్థులు, యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్​ మాఫియా, వీటికి అలవాటు పడ్డవారు నేరాలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. పోలీసులు అడ్డుకుంటే వారిపై దూసుకెళ్తున్నారు. గతంలో గంజాయి ముఠా నిజామాబాద్​ జిల్లాలో ఎక్సైజ్​ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో ఢీకొట్టడంతో ఆమె చనిపోయారు. తాజాగా మరో కానిస్టేబుల్​పైకి డ్రగ్​ ప్లెడ్లర్​ కారు ఎక్కించాడు.

ఇది కూడా చదవండి..: House Maid Theft | ఇళ్లను దోచేస్తున్న పని మనుషులు.. హైదరాబాద్​ పోలీసుల వార్నింగ్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *