అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Godavari Pushkaralu 2027 | గోదావరి పుష్కరాల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. వీటి నిర్వహణపై కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ మంత్రి డి. శ్రీధర్‌బాబు (Sridhar Babu) అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. గోదావరి తీరం వెంబడి ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రవాణా, భద్రత, వైద్య సదుపాయాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు.
గోదావరి పుష్కరాల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు, భక్తులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై సమావేశంలో కేబినేట్ సబ్ కమిటి ఛైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలోని మంత్రుల బృందం చర్చించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఘాట్ల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, రవాణా, విద్యుత్, వైద్య, భద్రత తదితర సదుపాయాల కల్పనపై మంత్రులు ప్రత్యేకంగా శాఖల వారీగా చర్చించారు. పుష్కరాల ప్రారంభానికి ముందే అన్ని పనులను నాణ్యతతో, సమన్వయంతో పూర్తి చేసి భక్తులకు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Godavari Pushkaralu 2027 | 67 కేంద్రాల అభివృద్ధి
గోదావరి నదీ తీరాన వున్న నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పుష్కర ఘాట్లుగా తీర్చిదిద్దనున్న మొత్తం 67 కేంద్రాలను 3 అంచెల్లో అభివృద్ధి చేయనున్నట్లు కమిటి కన్వీనర్, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ మంత్రుల బృందానికి వివరించారు. గోదావరి పుష్కరాల సమగ్ర ఏర్పాట్ల కోసం రూ. 1000 కోట్లతో వివిధ శాఖల పరిధిలో పనులు జరుగుతున్నట్లు వివరించారు.
Godavari Pushkaralu 2027 | ఎప్పటికప్పుడు సమీక్షించాలి
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గోదావరి పుష్కరాల పనుల పురోగతిని సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. వీలుకాని పక్షంలో వర్చువల్ మీటింగ్ ల ద్వారా పనులను సమీక్షించాలని సూచించారు. గోదావరి పుష్కరాల నిమిత్తం స్పెషల్ ఫండ్స్ కావాలని పలువురు ప్రజాప్రతినిధుల నుంచి వినతుల వస్తున్నందున ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చిస్తామని అన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాలకు ఎంచుకున్న ప్రాంతాల్లో ఆయా క్షేత్రాల మహాత్మ్యాన్ని, చారిత్రక–ఆధ్యాత్మిక విశిష్టతను తెలియజేసేలా స్వాగత ద్వారాలు, ప్రత్యేక అలంకరణలు ఏర్పాటు చేయాలని సూచించారు. నదీ తీరంలోని భద్రాచలం, ధర్మపురి వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో పుష్కర ఏర్పాట్లను సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్కనారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తాత్కాలిక బస్ షెల్టర్లు, ప్రయాణికుల వెయింటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
ఇది కూడా చదవండి..: Telangana Rising Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0′ నిర్వహణ.. అధికారికంగా ఆమోదం తెలిపిన కేబినెట్