అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Meeting | కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం జనరల్ బాడీ సమావేశానికి ఎట్టకేలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు (సోమవారం) ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు.
ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన జరగనున్న సమావేశంలో 30 అంశాలపై చర్చించడానికి అజెండాను రూపొందించారు. అయితే అన్ని సమస్యలపై చర్చ సాగే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కనీసం ప్రధానమైన సమస్యలకు పరిష్కారం లభించే దిశగానైనా చర్చ సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Kamareddy Municipal Meeting | పట్టణంలో అనేక సమస్యలు
పట్టణంలో తాగునీరు, మురుగు కాలువలు, చెత్త సేకరణ, ఇతర శానిటేషన్ పనులు, పన్ను వసూళ్లు, అక్రమ ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరపాలని ప్రజలు కోరుతున్నారు. గోదావరి జలాలు కామారెడ్డికి పూర్తిస్థాయిలో రావడానికి ఇంకా ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెబుతుండగా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా నిరంతరం కొనసాగించాల్సిన అవసరం ఉంది.
Kamareddy Municipal Meeting | చెత్తగా నిర్వహణ..
చెత్త సేకరణ కోసం వాహనాలు అందుబాటులో లేక వార్డుల్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతోంది. వాహనాలు రాకపోవడంతో ప్రజలు ఇళ్లలో చెత్త ఉంచలేక బయట ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. ఫలితంగా వార్డుల్లో దుర్వాసన వస్తోంది.
దోమల వ్యాప్తితో అనేక మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. మురుగు కాలువలు సరిగ్గా తీయడం లేదన్న ఆరోపణలున్నాయి. శానిటేషన్ పరిస్థితి అధ్వానంగా ఉందని, ఆ విభాగాన్ని పర్యవేక్షించడంలో అధికారులు విఫలం అవుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇక పన్ను వసూళ్ల విషయంలో ఇప్పటికే అధికారులు 5 శాతం మినహాయింపుతో ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చారు. అయితే సాధారణ ప్రజలు పన్ను సక్రమంగా చెల్లిస్తున్నా.. బడా నాయకులు, వ్యాపారులు, అధికారులు సక్రమంగా చెల్లిస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పన్ను వసూళ్లకు తన మన తేడా లేకుండా అందరి నుంచి పకడ్బందీగా వసూళ్లు చేపడితేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మున్సిపాలిటీకి ఆదాయం సమకూరనుంది.
Kamareddy Municipal Meeting | ఇంటి నిర్మాణాల విషయంలో
ఇక ఇంటి నిర్మాణాల విషయంలో అధికారులు, పాలకవర్గం కఠిన వైఖరి అవలబించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంటి పేరిట అనుమతులు తీసుకుని కమర్షియల్ భవనాలుగా మారుస్తున్న వాటిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేస్తున్నారు.
కమర్షియల్ వ్యాపారం చేస్తున్న భవనాలలో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఏదైనా ఘటన జరిగితే విచారణకు వెళ్లే అధికారులకు ఆ భవనం నివాసం ఉండే ఇంటి అనుమతులు ఉండటంతో చేసేది లేక వెనుదిరుగుతున్నారు.
ముఖ్యంగా భారీ భవనాల నిర్మాణాల సమయంలో ఫైర్ సేఫ్టీ తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మరికొన్నింటిని అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతున్నారు. అయినా వాటిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారన్న ఆరోపణలున్నాయి.
ఒకవేళ అధికారులు నోటీసులు జారీ చేస్తే నాయకులు ఎంటరై అనుమతులు ఏమీ లేకుండా తాము చూసుకుంటామని భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలున్నాయి.
Kamareddy Municipal Meeting : వర్షాలు పడితే..
కామారెడ్డి పట్టణంలో వర్షాలు పడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు కాలువలు సరిగ్గా లేక కాలువల్లో నీరు నిండిపోయి ఇళ్లలోకి, రహదారులపైకి చేరుకుంటున్నాయి. ఏళ్ల తరబడి ఈ సమస్య ఉన్నా ఏ పాలకవర్గం కూడా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. దీంతో రోడ్లపై నీరు భారీ చేరి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
అండర్ గ్రౌండ్ డ్రైయినేజీ పనులు చేపట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉన్నా ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో ఈ అంశాన్ని అజెండాలో ప్రత్యేకంగా చేర్చి చర్చించిన దాఖలాలు లేవు.
ప్రస్తుతం ఎండాకాలం అయినా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న క్రమంలో పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వర్షా కాలానికి ముందు చర్యలు తీసుకుని పరిష్కారం చూపాల్సిన అధికారులు అలా చేయకుండా వర్షాకాలంలోనే అప్పటికప్పుడు కంటితుడుపు చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు.
Kamareddy Municipal Meeting | సమావేశం సజావుగా సాగేనా..?
పాలకవర్గం కొలువైన రెండు నెలలకు మొదటి సమావేశం జరుగుతుండటంతో మొదటి సమావేశం ఎలా జరగబోతుందనే చర్చ సాగుతోంది. గతంలో జరిగిన పరిచయ కార్యక్రమం, బడ్జెట్ సమావేశాలు రసాభాసగా సాగాయి.
సమస్యలపై చర్చించడానికి ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశమైనా అర్థవంతమైన చర్చతో సమస్యల పరిష్కారాలకు వేదికగా మారుతుందా.. లేక అధికారులపై విరుచుకుపడి సమస్యను పక్కదారి పట్టిస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నూతనంగా ఎన్నికైన పాలకవర్గం అధికారులపై పెత్తనం చలాయించేందుకు, అధికారులను తమ కంట్రోల్ లో పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. గత బడ్జెట్ సమావేశంలో పార్టీలతో సంబంధం లేకుండా కమిషనర్, టీపీవోపై సరెండర్ తీర్మానం చేశారు.
బడ్జెట్ సమావేశంలో జరిగిన తీరుపై నొచ్చుకున్న కమిషనర్ ఇప్పటివరకు సెలవులోనే ఉన్నారు. కామారెడ్డి ఆర్డీవో గిరి ఇంఛార్జి కమిషనర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరగబోయే సమావేశంలో అధికారులపై ఏ మేరకు కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఈసారి ఎవరిని టార్గెట్ చేయనున్నారనే చర్చ సాగుతోంది.
ఇది కూడా చదవండి: Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు.. ఇవి ఇంట్లో ఉంటే సిరిసంపదలే!
ఇది కూడా చదవండి: KCR Jagtial Sabha | గులాబీ బాస్ ఆగమనం.. 20న జగిత్యాలలో బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వచ్చేనా!

