అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Kavitha Panchajanya Sabha | ఇందూరు (Nizamabad) వేదికగా రాజకీయ పునరేకీకరణకు బీజం వేస్తున్నారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షుడు కల్వకుంట్ల కవిత(Kavitha). సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభ నుంచి సమర శంఖం పూరించబోతున్నారు.
Kavitha Panchajanya Sabha | రాబోయే అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా..
రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారు. 2014లో ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ, రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులను మట్టి కరిపించడంలో కవిత వ్యూహ రచన ఎంతో ఉంది. తాను నిజామాబాద్ నుంచి లోక్ సభకు ఎన్నికవగా జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో కొత్త అభ్యర్థిని గెలిపించారు. తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన తొమ్మిది మందిలో నలుగురు అదివరకే ఎమ్మెల్యేలుగా గెలవగా ఐదుగురు మొదటి విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
Kavitha Panchajanya Sabha | క్రియాశీలకంగా కవిత..
సీనియర్, జూనియర్ నాయకులతో పాటు పార్టీ శ్రేణులను తెలంగాణవాదులను ఏకం చేసి అన్ని స్థానాల్లో పార్టీ విజయం సాధించడంలో కవిత క్రియాశీలంగా పని చేశారు. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మ ప్రశస్తిని విశ్వవ్యాప్తం చేసిన కవిత రెండు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న తెలంగాణ రక్షణ సేన పార్టీని స్థాపించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులు తీసుకున్న కవిత కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత సోమవారం మొదటిసారిగా ఇందూరు గడ్డపై అడుగు పెడుతున్నారు.
Kavitha Panchajanya Sabha | ‘పాంచజన్యం’తో ప్రజల ముందుకు..
తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రధాన ఎజెండా అయిన పాంచజన్యంను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సభ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన ఎజెండాను ప్రజలకు వివరించడంతో పాటు ఇదే వేదికపై నుంచి ఉమ్మడి నిజామాబాద్ నేతల రాజకీయ పునరేకీకరణకు పిలుపునివ్వనున్నారు. వివిధ పార్టీల్లో ఉన్న తెలంగాణవాదులను, తెలంగాణ ఉద్యమకారులను, ఈ గడ్డపై మమకారం ఉన్న నేతలను ఏకతాటిపైకి తెచ్చి రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో విజయం సాధించేలా అడుగులు చేస్తున్నారు.
నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో..
నిజామాబాద్ కలెక్టరేట్ గ్రౌండ్లో సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు నిర్వహించే పాంచజన్య సంకల్ప సభకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 25వేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలను తరలిస్తున్నారు. ఇదే వేదిక పై నుంచి కల్వకుంట్ల కవిత పాంచజన్యం పూరించి తనకు రాజకీయ భిక్ష పెట్టిన నిజామాబాద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సబ్బండ వర్గాల వికాసం, సాధికారత సాధించిన సామాజిక న్యాయ తెలంగాణగా తీర్చిదిద్దేందుకు బ్లూ ప్రింట్ ప్రకటించనున్నారు. నిరుపేదలు, పేదలు, మధ్య తరగతి ప్రజలు తమ సంపాదనలో సింహభాగం విద్య, వైద్యానికే ఖర్చు చేస్తుండటంతో విద్య, వైద్యం పూర్తి ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించనున్నారు.
నిరుద్యోగ యువతకు..
నిరుద్యోగ యువతకు నాలుగులక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వనున్నట్టు ప్రకటిస్తారు. యువతకు స్వయం ఉపాధి కోసం బ్యాంక్ లింకేజీతో సంబంధం లేకుండా రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి లోన్లు ఇప్పించే విధానం ప్రకటించనున్నారు. రైతును రాజును చేసేందుకు తాము ఏం చేయబోతున్నామో వివరిస్తారు. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం తాము తీసుకున్న సంకల్పాన్ని వివరిస్తారు.
కవిత పర్యటన ఇలా..
సోమవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఇందల్వాయి మండలం గన్నారంలో తెలంగాణ రక్షణ సేన జెండా ఎగురవేస్తారు. మాధవ నగర్ సాయిబాబా గుడి వద్ద నుంచి ర్యాలీగా నిజామాబాద్ నగరానికి బయల్దేరుతారు. మాధవ నగర్ సాయిబాబా ఆలయం నుంచి పులాంగ్ చౌరస్తా, రాజారాజేంద్ర చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, గాంధీచౌక్, బస్టాండ్ మీదుగా ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 3.45 గంటల మధ్య సమావేశ వేదిక వద్దకు కవిత చేరుకుంటారు.
సభకు భారీ ఏర్పాట్లు..
నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న పాంచజన్య సంకల్ప సభకు తెలంగాణ రక్షణ సేన నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని అన్ని కూడళ్లను పార్టీ జెండాలు, తోరణాలతో నింపేశారు. నిజామాబాద్‌కు వచ్చే అన్ని దారుల్లో సభకు సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. సభకు తరలివచ్చి వేలాది మంది నాయకులు, కార్యకర్తల కోసం కలెక్టరేట్ గ్రౌండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజలు, కార్యకర్తల కోసం తాగునీరు సహా ఇతర ఎమర్జెన్సీ సేవలు అందుబాటులో ఉంచారు. పాంచజన్య సంకల్ప సభ అనంతరం కవిత నందిపేట మండలం సీహెచ్ కొండూరులోని రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.