Nizamabad BJP | ఇందూరు అభివృద్ధిపై మాట్లాడే నైతిక హక్కు కవితకు లేదు

టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత ఎంపీ అర్వింద్​పై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad BJP | టీఆర్​ఎస్​ వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) ఎంపీ అర్వింద్​పై (MP arvind) చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి అన్నారు. ఈ మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

Nizamabad BJP | ‘దొంగే దొంగ అన్నట్లు’..

స్రవంతి రెడ్డి మాట్లాడుతూ.. కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలు వింటుంటే దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. ఊరంతా దోచుకున్న వ్యక్తి ఊరి పెద్దకు నీతులు చెప్పినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న పదేళ్ల కాలంలో మాధవ్‌నగర్ ఆర్వోబీ పనులు ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఎంపీ ధర్మపురి అర్వింద్ నిధులు మంజూరు చేయించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కేటాయించకుండా ఏళ్ల తరబడి జాప్యం చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. పదేళ్లు రాష్ట్రాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గల్లీ స్థాయి కాంట్రాక్టుల వరకు కమీషన్ల ఆరోపణలు ఎదుర్కొన్న మీకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందని ప్రశ్నించారు.

Nizamabad BJP | కళ్ల ముందే అభివృద్ధి

ఏడేళ్లలో ఎంపీ అర్వింద్ ఒక్క రూపాయి తీసుకురాలేదని కవిత మాట్లాడటం పచ్చి అబద్ధమని స్రవంతి రెడ్డి మండిపడ్డారు. అమృత్ భారత్ పథకం కింద నిజామాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ, మాధవ్‌నగర్, మామిడిపల్లి, అడవి మామిడిపల్లి, అర్సపల్లి, జానకంపేట్, ఇందల్వాయి ప్రాంతాల్లో ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, జిల్లా విద్యార్థుల భవిష్యత్తు కోసం రెండు కేంద్రీయ విద్యాలయాలు, రెండు నవోదయ విద్యాలయాలతో పాటు కేంద్రం నుంచి వచ్చిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కళ్ల ముందే ఉన్నాయని తెలిపారు. ఇన్ని అభివృద్ధి కవితకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

Nizamabad BJP | పసుపు బోర్డు రైతుల కల..

పసుపు బోర్డు అనేది మెడలో వేసుకునే బోర్డు కాదని, అది నిజామాబాద్ పసుపు రైతులు తరతరాలుగా కన్న కల అని స్రవంతి రెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో ప్రజలకు తెలుసని, ఇప్పుడు పసుపు బోర్డు గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. లిక్కర్ బాటిళ్ల రేట్లు పెంచడం తెలిసిన వారికి రైతుల చెమట విలువ, పంటకు మద్దతు ధర విలువ ఎలా తెలుస్తుందని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్‌తో కవిత దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. కొత్త రాజకీయ వేదికలు ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన గతంలో ఎదుర్కొన్న ఆరోపణల నుంచి తప్పించుకోలేరని అన్నారు.

కవితకు ప్రజలే సమాధానం చెబుతారు : దంపల్లి జ్యోతి

డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దంపల్లి జ్యోతి మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే కవిత ‘పాంచజన్యం’ పేరుతో సభ నిర్వహించి రాజకీయ నాటకాలు ఆడారని విమర్శించారు. ఇందూరు కోడలినని చెప్పుకునే కవిత.. ప్రజలతో నిజమైన అనుబంధం ఉంటే మాటల్లో కాదు, చేతల్లో చూపించాలన్నారు. కవిత కార్చే మొసలి కన్నీళ్లను ఇందూరు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఇందూరు గడ్డ బీజేపీకి కంచుకోట అన్నారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని… ఎంపీపై మరోసారి అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన సమాధానం చెబుతారని జ్యోతి హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు చింత ప్రసన్న రెడ్డి, ఇప్పకాయల సుమిత్ర దేవి, పులగం వైష్ణవి, కల్పే అర్చన, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: యాంకర్​ను ఆకాశానికెత్తేసిన ‘ఇరుముడి’ డైరెక్టర్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *