అక్షరటుడే, బాల్కొండ(పోచంపాడ్): Prashanth Reddy Sports | విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పిలుపునిచ్చారు. పోచంపాడ్ జడ్పీహెచ్ఎస్లో మండలస్థాయి ఎస్జీఎఫ్ అంతర్‌పాఠశాలల క్రీడలను ఆయన ప్రారంభించారు.
Prashanth Reddy Sports | బిల్లులివ్వకపోవడంతో అభివృద్ధి పనులకు బ్రేక్..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మెండోరా మండల పరిధిలోని పాఠశాలలకు నూతన భవనాలు, అదనపు గదులు మంజూరయ్యాయన్నారు. అయితే నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయన్నారు. అదేవిధంగా ‘మన ఊరు – మన బడి’ పథకం కింద వివిధ పాఠశాలల్లో చేపట్టిన కిచెన్ షెడ్లు, ప్రహరీలు, టాయిలెట్ల నిర్మాణాలకు సైతం చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయమై తాను ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు సీఎం, ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు.
Prashanth Reddy Sports | పాఠశాలల్లో డ్యయల్ డెస్క్..
ఎంఈవో కోరిన మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డ్యూయల్ డెస్క్ బల్లల కొరతను తీర్చేందుకు కృషి చేస్తామని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తమ వియ్యంకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త దయానందరెడ్డి ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛందంగా డ్యూయల్ డెస్కులు, కంప్యూటర్లు సమకూర్చి విద్యార్థుల విద్యకు అండగా నిలిచారని ప్రస్తావించారు. అలాగే చాకిర్యాల్ పాఠశాలలో అవసరమైన వసతుల కోసం సర్పంచ్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. గ్రామ వీడీసీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు అవసరమైన వివరాలతో వేల్పూరులోని క్యాంప్ కార్యాలయంలో తనను సంప్రదిస్తే దయానందరెడ్డి సహకారంతో తగిన వసతులు సమకూర్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
Prashanth Reddy Sports | టీవీలు, స్మార్ట్ఫోన్లకు దూరంగా..
నేటి సాంకేతిక యుగంలో విద్యార్థులు టీవీలు, స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లకు బానిసలై మైదానాలకు దూరమవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులను ఫోన్లకు దూరంగా ఉంచి, ప్రతిరోజూ సాయంత్రం కనీసం గంటపాటు మైదానంలో ఏదో ఒక ఆట ఆడేలా తల్లిదండ్రులు బాధ్యతగా ప్రోత్సహించాలని కోరారు. తనది మొదటినుంచి క్రీడానేపథ్యం ఉన్న కుటుంబమన్నారు. మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను సొంత ఇంటి పనుల్లా బాధ్యతగా భావించి సమర్థవంతంగా నిర్వహిస్తున్న మండల పీఈటీలు విద్యాసాగర్, రాజ్‌కుమార్, గంగాధర్, రమేష్, శ్రీనివాస్, ప్రభాకర్‌ల అంకితభావాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందించారు. అలాగే కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన పోచంపాడ్ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ధర్మపురి, ఉపాధ్యాయులు, సర్పంచ్ మాధురి రాజు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ధర్మపురి, పోచంపాడ్ సర్పంచ్ మాధురి రాజు, డీసీసీబీ డైరెక్టర్ మెండోరా మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మణ్, మండల పరిధిలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు), ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Armed Reserve Police | ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసుల పనితీరు అభినందనీయం