అక్షరటుడే, వెబ్డెస్క్ : Samvidhan Raksha March | భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో నవంబర్ 26న సంవిధాన్ రక్షా మార్చ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కోరారు.
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, మౌలిక విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పొన్నం అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్దనున్న డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ‘సంవిధాన్ రక్షా మార్చ్’ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Samvidhan Raksha March | అందరి బాధ్యత
రాజ్యాంగ పరిరక్షణ ఒక రాజకీయ కార్యక్రమం కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజల హక్కులను కాపాడుకునే మనందరి బాధ్యత అన్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి బి.ఎం. సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి..: Telangana New Pensions | కొత్త పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లోకి రూ.2 వేలు..