అక్షరటుడే, వెబ్‌డెస్క్: Cm revanth reddy | రాష్ట్రంలో ప్రజాపాలన ఎందుకు పోవాలి.. ఒక్క సారి నీకు పదవి ఇవ్వనందుకు ప్రజాపాలన పోవాలా.. మళ్లీ ఆ పాపాల భైరవుడు అధికారంలోకి రావాల్నా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ‘చూసుకుందాం కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో నువ్వానేనా.. ప్రజాపాలనా.. పాపాల భైరవుడా చూసుకుందామని’ సవాల్ విసిరారు. ‘వచ్చే ఎన్నికల్లో నీకున్న ప్రతిపక్ష హోదా ఊడగొడతా.. 2022లో నిన్ను ఒడగొట్టినా.. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్లో నీ పార్టీకి ఘోరి కట్టినా.. వచ్చే ఎన్నికల్లో ఆ ఘోరీపై కాంగ్రెస్ కార్యకర్తలు జెండా ఎగురవేస్తారంటూ’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లిలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Cm revanth reddy | రైతుభరోసా నిధులు విడుదల
కరీంనగర్ జిల్లా భూపాలపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశానికి వెన్నెముక రైతు అని అన్నారు. ఆ రైతులను నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందన్నారు. రైతు సంక్షేమం కాంగ్రెస్ నినాదమే కాదు.. విధానమని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకువచ్చిందని హస్తం పార్టీయేనని గుర్తు చేశారు. దేశంలోని వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. దేశంలోనే తొలిసారి పంటలకు ఉచిత కరెంట్ పథకాన్ని ప్రారంభించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వివరించారు.
Cm revanth reddy | రైతులకు రుణమాఫీ
ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేసి.. అన్నదాతలను రుణవిముక్తులను చేశామని చెప్పారు. అలాగే రైతు భరోసా ఇస్తూ ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. సన్న వడ్లకు బోనస్ అందిస్తూ.. రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
Cm revanth reddy | పార్టీని గుండెల మీద తన్నారు…
జీవన్‌రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ.. పెద్దాయన ప్రజాపాలన పోవాలి.. పాపాల బైరవుడు రావాలి అంటున్నారన్నారు. ప్రజాపాలన ఎందుకు పోవాలన్నారు. జగిత్యాల నిన్ను ఓడిస్తే.. నీకు మంత్రి పదవి రాకపోతే ప్రజాపాలన పోవాలా అని ప్రశ్నించారు. ప్రజాపాలన ఎందుకు పోవాలో చెప్పాలని సవాల్ విసిరారు. 40 ఏళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనను భూజాన మోశారన్నారు. పల్లకీలో అసెంబ్లీకి పంపించారన్నారు. మీ కుటుంబం కోసం కార్యకర్తలు కష్టపడ్డారన్నారు. పార్టీ 14 సార్లు భీఫామ్ ఇచ్చిందన్నారు. ఒక్క ఏడాది పదవి లేకపోతే పార్టీని గుండెల మీద తన్ని శత్రువు పంచన చేశారని విమర్శించారు.
Cm revanth reddy | డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారా..
కేసీఆర్ ఎర్రవెల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫాం హౌస్ కట్టుకున్నాడు.. జన్వాడాలో కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. మొయినాబాద్ హరీశ్‌రావు ఇల్లు కట్టుకున్నాడు.. కానీ ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. తాము ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నందుకు ప్రజాపాలన పోవాలా అని ప్రశ్నించారు. ఉచిత్ విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, రేషన్ బియ్యం, ఉచిత బస్సు సౌకర్యం, 70 వేల ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వన్ని ఇస్తున్నందుకు ప్రజాపాలన పోవాలా అని అడిగారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూర్ లక్ష్మణ్, సీతక్క, వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: KCR Jagtial Meeting | నువ్వు వెయ్యి జన్మలు ఎత్తిన చావను.. కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

