Chain Snatching | జిల్లాలో ‘గొలుసు’ చోరీలు.. యథేచ్ఛగా తిరుగుతున్న స్నాచింగ్ ముఠాలు

నిజామాబాద్ జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలు జరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్ : Chain Snatching | జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలు, తెల్లవారుజాము సమయాల్లో తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంగా జిల్లాలో దొంగతనాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ముఖ్యంగా చైన్ స్నాచింగ్ ఘటనలు జిల్లా ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత 12 నెలల్లో జిల్లావ్యాప్తంగా సుమారు 180కి పైగా చోరీలు జరగగా, అందులో 70కి పైగా చైన్ స్నాచింగ్ కేసులే ఉండటం జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది.

Chain Snatching | ​వరుస దాడులు.. వణికిస్తున్న ముఠాలు

​జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్, బాల్కొండ వంటి మండలాల్లోనూ చైన్​స్నాచింగ్​ లు పెరిగాయి. గత కొద్ది రోజులుగా చోటుచేసుకున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. ​ఎఫ్‌సీఐ కాలనీలో ఇటీవల తెల్లవారుజామున వాకింగ్‌కు వెళ్లిన మహిళ మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. స్థానికులు కేకలు వేసేలోపే బైక్‌పై మాయమయ్యారు. ​ఆర్మూర్ పెర్కిట్​లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలిని అడ్డగించి, కత్తితో బెదిరించి 3.5 తులాల బంగారాన్ని అపహరించారు.

Chain Snatching | బోధన్​ ప్రధాన కూడలిలో..

​బోధన్ (Bodhan) ప్రధాన కూడలిలో రద్దీగా ఉండే రోడ్డుపైనే మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లిన ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ​డిచ్‌పల్లి పరిసరాల్లో ఇంటి ముందు పని చేసుకుంటున్న గృహిణిని గమనించి, ముసుగు వేసుకుని వచ్చి క్షణాల్లో గొలుసును అపహరించిన వైనం నిఘా లోపాలను ఎత్తిచూపింది. తాజాగా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగుడు అపహరించుకుని పరారయ్యాడు.

Chain Snatching | ​ఎందుకీ వైఫల్యం?

Chain Snatching

నేరాల నియంత్రణలో పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న తీరుపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రధాన రహదారులపై సీసీ కెమెరాలు ఉన్నా, నేరం జరిగే అంతర్గత వీధుల్లో కెమెరాలు లేకపోవడం, ఉన్నా పని చేయకపోవడం దుండగులకు కలిసి వస్తోంది. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో పెట్రోలింగ్ వాహనాల సంచారం నామమాత్రంగా మారింది. దీనిని దుండగులు ముందే పసిగట్టి, గస్తీ లేని సమయాలను ఎంచుకుంటున్నారు.

Chain Snatching | అంతర్రాష్ట్ర ముఠాల పనేనా..

నేరం చేసిన వెంటనే పక్కనే ఉన్న సరిహద్దుల ద్వారా పరారవుతున్న ముఠాలను పట్టుకోవడంలో నిఘా వ్యవస్థ విఫలమవుతోంది. పాత నేరస్తుల కదలికలపై నిరంతర పర్యవేక్షణ కొరవడింది. అంతర్రాష్ట్ర ముఠాల పనేనని పోలీసు యంత్రాంగం సైతం భావిస్తోంది. కాగా.. కష్టపడి దాచుకున్న బంగారం, ఆభరణాలు క్షణాల్లో దొంగల పాలవుతుండడంపై ఆందోళన చెండుతున్నారు. పోలీసులు గస్తీని పెంచి, కాలనీల వారీగా నిఘాను కట్టుదిట్టం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి..: Tyagaraja Atma Vicharam | త్యాగయ్య కీర్తనల ‘ఆత్మ విచారం’ ఆవిష్కరణ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *