అక్షరటుడే, బోధన్ : Educational Institution Attacks | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
Educational Institution Attacks | ఫిర్యాదులు అందాయి
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడినట్లు సమాచారం ఉందన్నారు. వసతులు లేవని, పుస్తకాలు విక్రయిస్తున్నారనే కారణాలతో విద్యాసంస్థలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ఇలాంటివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Educational Institution Attacks | కొన్ని ఉదాహరణలివే..
డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశాపూర్, బర్దిపూర్ శివారులోని నారాయణ విద్యాసంస్థలోకి అక్రమంగా ప్రవేశించి అక్కడ కుర్చీలు , ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన ఘటనలో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని చందూరు మండలంలో శ్రీసాయి విద్యాలయం స్కూల్లో యాజమాన్యం అనుమతి లేకుండా ప్రవేశించి సిబ్బందిని బెదిరిస్తూ పిల్లలను భయాందోళనకు గురిచేసిన ఘనటలోనూ కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ రెండు కేసులలో ఉన్నవారిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లయితే వారిపై అదనపు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు.
Educational Institution Attacks | సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి
విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిపై సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. సమస్యలపై అధికారులు నిబంధన ప్రకారం విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. అంతేకానీ విద్యార్థి సంఘాల పేరు చెప్పుకొని పాఠశాలలో ఇబ్బందికర వాతావరణ సృష్టించవద్దని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగిస్తూ వారికి అసౌకర్యం కలిగించకూడదని సూచించారు.
ఇది కూడా చదవండి..: Fake Accreditation Card | నకిలీ మీడియా అక్రెడిటేషన్ కార్డుపై పోలీసులకు ఫిర్యాదు