అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indiramma Housing Tenders | క్యూర్ పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. నగరంలోని మూడు కార్పొరేషన్ల పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ మరో రెండు నుంచి మూడు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
Indiramma Housing Tenders | గోషామహల్ నియోజకవర్గంలో

గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలను గురువారం మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్ధానికఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులతో కలిసి పొంగులేటి లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రతి పేద కుటుంబానికి ఇల్లు” అనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. క్యూర్ పరిధిలోని 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక్కో చోట కనీసం 500 నుంచి 1000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
Indiramma Housing Tenders | పట్టాలు ఇస్తాం
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి 5,500 వరకు ఇళ్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎకరాకు రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఉన్నా కూడా అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి వారి పేరిట పట్టాలు ఇస్తామని మంత్రి తెలిపారు. ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి అర్హులకు అందించినట్లు వెల్లడించారు. మిగిలిన పేదలకు కూడా ఇళ్లు మంజూరు చేసేలా పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించేందుకు కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశామన్నారు. పేదలకు వారి జీవనాధారాలకు దగ్గరగా, అదే నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: ACB Raids on DSP | డీఎస్పీ ఇంట్లో ఏసీబీ సోదాలు