అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Mystery | ‘ఓవైపు మున్సిపాలిటీ (Kamareddy municipality) ఎన్నికల్లో పోలీసులు తీరిక లేకుండా బందోబస్తులో నిమగ్నమయ్యారు. సరిగ్గా అప్పుడే ‘సార్.. ఓ డెడ్ బాడీ ముక్కలు లభించాయి సార్’ అంటూ పోలీసులకు ఫోన్ రావడంతో అవాక్కయ్యారు. సిటీ నడిబొడ్డున ఓ మనిషి మొండెం, నడుం భాగాలు లభించడం కలకలం రేపాయి. దాంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. కేసు ఛేదించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లభించలేదు.
Kamareddy Mystery | కామారెడ్డి పట్టణంలో..
కామారెడ్డి పట్టణంలో (Kamareddy) ఫిబ్రవరి 2న సీఎస్ఐ చర్చి(CSI) మైదానంలో వెలుగు చూసిన ఈ ఘటనలో రెండు రోజుల తర్వాత అదే ఏరియాలోని మురికి కాలువలో కాళ్లు, చేతులు లభ్యం కావడం పోలీసులకు సవాల్‌గా మారింది. దాంతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డాయి. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. సమాచారం తెలిపిన వారికి రూ.10 వేలు బహుమతి కూడా ప్రకటించినా కేసులో అనుకున్న పురోగతి లభించలేదు
Kamareddy Mystery | కలకలం రేపిన ఘటన
మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) పీక్స్‌లో ఉన్న సమయంలో వెలుగు చూసిన సగం డెడ్ బాడీ ఘటన కామారెడ్డిలో కలకలం రేపింది. హత్య చేసింది ఎవరు..? హత్యకు గురైంది ఎవరో తెలియక పోలీసులు సందిగ్ధంలో పడ్డారు. జిల్లా కేంద్రంలోనే ఒక మనిషి అవశేషాలు ముక్కలుగా చేసి వేర్వేరు చోట్ల పడేయడం ఒక విధంగా పోలీసులకు సవాల్ విసరడమేనన్న చర్చ సాగింది. అయినా ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉండటంతో అసలు కేసు కొలిక్కి వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Kamareddy Mystery | ఎక్కడో హత్య చేసి..
ఈ హత్య కామారెడ్డిలో జరిగి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి మృతుడి వివరాలు తెలియకుండా ఉండేందుకే కామారెడ్డిలో శరీర భాగాలను అక్కడక్కడ పడేసి ఉంటారని తెలుస్తోంది. ఒకే చోట పడేస్తే పోలీసులకు ఈజీగా తేలిపోతుందనే ఉద్దేశంతో అక్కడక్కడ పడేసి పోలీసులకు సవాల్ గా మారారన్న టాక్ వినిపిస్తోంది.
Kamareddy Mystery | సీసీ కెమెరాలకు చిక్కకుండా..
కామారెడ్డి పట్టణ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసు ఓవైపు పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతుండగా మరోవైపు సీసీ కెమెరాలో డెడ్ బాడీ దృశ్యాలు కానీ, డెడ్ బాడీని తీసుకువచ్చిన వ్యక్తి దృశ్యాలు ఎక్కడా రికార్డు కాకపోవడం చర్చనీయాంశంగా మారాయి. పట్టణంలో చిన్న ఘటన జరిగినా ఎక్కడో ఒకచోట సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అవుతుంటాయి. అలాంటిది ఒక మనిషి శరీర భాగాలు తీసుకువచ్చి జిల్లా కేంద్రం నడిబొడ్డున అదికూడా సెంట్రల్ పాయింట్లో రెండు చోట్లా పారేసి వెళ్లడం చిన్న విషయం కాదన్న చర్చ సాగుతోంది.
ఐదు నెలలుగా విచారణ..
పట్టణంలో కలకలం రేపిన డెడ్ బాడీ శరీర భాగాలు లభించిన ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి విచారణ ముమ్మరం చేశారు. డెడ్ బాడీని గుర్తిస్తే కేసు సగం పూర్తయినట్టేనని భావించి మృతదేహానికి సంబంధించిన శరీర భాగాల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతర పోలీస్ స్టేషన్లకు పంపించారు. ఆ సమయంలో వివిధ పోలీస్ స్టేషన్లలో అదృశ్యమైన వ్యక్తుల వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. డెడ్ బాడీని గుర్తించిన వారికి రూ.10 వేలు బహుమతి ఇస్తామని కూడా పోలీసు శాఖ ప్రకటించింది. అయినా ఫలితం లభించలేదు. కేసు విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది.
విచారణ జరుపుతున్నాం
– మధుసూదన్, డీఎస్పీ, కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలో లభించిన మనిషి శరీర భాగాల కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పట్టణంలోని సీసీ కెమెరాలను పూర్తిస్థాయిలో పరిశీలించాం. సీసీ పుటేజీల్లో ఎక్కడ కూడా డెడ్ బాడీని తీసుకుని వచ్చిన దృశ్యాలు రికార్డు కాలేదు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం. త్వరలోనే కేసును పరిష్కరిస్తాం.