అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Smart Ration Cards | తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక హంగులతో కూడిన ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy )స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్డులను పంపిణీ చేయనున్నారు. అయితే ఈ పంపిణీకి సిద్ధం చేసిన స్మార్ట్ కార్డుల డిజైన్లో సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు మాత్రమే ముద్రించడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Telangana Smart Ration Cards | భగ్గుమన్న బీజేపీ..
స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించకపోవడంపై రాష్ట్ర బీజేపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాగా పేదలకు ఇస్తున్న ఉచిత బియ్యంలో సింహభాగం రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రానిదే సింహభాగమని అలాంటప్పుడు ఎవని అయ్య జాగీరు అని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు మాత్రమే వేసుకుంటున్నారు? అని ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. పేదలకు కేంద్రమే ఉచిత బియ్యాన్ని ఇస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తమ స్వార్థ ప్రచారం కోసం సీఎం, మంత్రుల చిత్రాలను ముద్రించుకోవడం హాస్యాస్పదమని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మారితే మళ్లీ కొత్త కార్డులు ఇవ్వాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.
Telangana Smart Ration Cards | ఉద్రిక్తతల హెచ్చరిక..
ప్రధాని మోడీ ఫోటో లేకుండా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసే ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. పేదలకు ఇస్తున్న 6 కిలోల బియ్యంలో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని, అలాంటిది మోడీ ఫోటోను విస్మరించడం కేంద్రాన్ని అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగే లాంఛనప్రాయ పంపిణీ సభలో నిరసనల వల్ల ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. కాంగ్రెస్కు పని తక్కువ, ప్రచారం ఎక్కువ అంటూ విమర్శలు గుప్పించారు. పంపిణీకి ముందే చెలరేగిన ఈ రాజకీయ వివాదం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి: Kamareddy Road Accident | జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీ..: ముగ్గురికి గాయాలు