అక్షరటుడే వెబ్‌డెస్క్: Indiramma Houses | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) కీలక అప్‌డేట్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలోని ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు ఆయన ప్రకటించారు.
Indiramma Houses | సమీక్షా సమావేశం..
ఈ భారీ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించిన ఏర్పాట్లపై కేబినెట్ భేటీకి ముందు మంత్రి పొంగులేటి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC) పరిధిలో లక్ష ఇళ్లకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ మరో రెండు, మూడు రోజుల్లోనే పూర్తిగా ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Indiramma Houses | పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం..
నగర పరిధిలోని మొత్తం 19 నియోజకవర్గాల్లో తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లుగా మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా, ఫేజ్-1లో ప్రతి నియోజకవర్గంలో కనీసం 500 నుంచి 1000 ఇళ్ల చొప్పున నిర్మాణ పనులను మొదలుపెడతామని అన్నారు. ఆ తర్వాత వచ్చే రెండు, మూడు విడతల్లో మిగిలిన ఇళ్లను కూడా మంజూరు చేసి, లబ్ధిదారులకు అందజేస్తామని చెప్పారు. పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ముందు ఉన్న లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Teacher Meals | తెలంగాణ ఈ-కేబినెట్ కీలక నిర్ణయం