అక్షరటుడే, భీమ్‌గల్ : Revanth Government Failure | ఆరు గ్యారంటీల పేరుతో అనేక వాగ్దానాలు చేసి, అధికారంలోకి వచ్చాక మహిళలు, వృద్ధులు, విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) విమర్శించారు. మోర్తాడ్ (Morthad) మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మహిళా సదస్సు, వంటావార్పు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
Revanth Government Failure | ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను చూపిస్తూ..
ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి (CM Revanth reddy), భట్టి విక్రమార్క ఇచ్చిన హామీల వీడియో క్లిప్పింగులను ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించి ఎండగట్టారు. అనంతరం మహిళలతో కలిసి వంటావార్పులో పాల్గొని, బతుకమ్మ ఆడారు. వేముల మాట్లాడుతూ.. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని చెప్పిన సర్కార్ ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, గడిచిన సమయానికి లెక్కగడితే ఒక్కో మహిళకు రూ.82,500 బాకీ పడిందని తెలిపారు. పెన్షన్లను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామని చెప్పి ఎగ్గొట్టడం వల్ల ఒక్కో పింఛన్‌దారునికి రూ.66,000 బకాయి పడిందన్నారు.
Revanth Government Failure | తులం బంగారం ఏమాయే..
కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని మాట తప్పారని, బాల్కొండ నియోజకవర్గంలోనే 5,000 మంది లబ్ధిదారులు దీనికోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని, 200 యూనిట్లు దాటితే విద్యుత్ బిల్లుల భారంతో పాటు నిరంతరం కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో రాజకీయ పక్షపాతం వీడి, ప్రజల సమక్షంలో ‘లక్కీ డ్రా’ ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను కాంగ్రెస్ బాకీ కార్డులతో నిలదీయాలని పిలుపునిచ్చారు.
సదస్సులో మహిళల ఏకగ్రీవ తీర్మానాలు
సభకు హాజరైన వేలాదిమంది మహిళల ఆమోదంతో పలు డిమాండ్లతో కూడిన తీర్మానాన్ని ఆమోదించారు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లను తక్షణమే పునరుద్ధరించాలని, మహాలక్ష్మి పథకం బకాయిలు రూ.82,500 వెంటనే ఖాతాల్లో జమ చేయాలని కోరారు. పెన్షన్ పెంపు బకాయిలు రూ.66,000 చెల్లించడంతో పాటు 57 ఏళ్లు నిండిన వారికి నూతన పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: సీఎం మాట్లాడుతుంటే భయమేస్తోంది