అక్షరటుడే, బోధన్ : Farmer Welfare | రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) అన్నారు. నవీపేట(Navipet) మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహించిన విత్తన మేళా కార్యక్రమాన్ని ఆయన కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించారు.
Farmer Welfare | వంగడాల నాణ్యత పరిశీలన..
రైతులకు అందిస్తున్న వివిధ పంటలకు సంబంధించిన వంగడాలను, ఎరువులు, క్రిమిసంహారక మందుల నాణ్యతను ప్రభుత్వ సలహాదారు పరిశీలించారు. నకిలీ, నాసిరకం విత్తనాల పంపిణీ జరగకుండా, ఎక్కడ కూడా రైతులు నష్టపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. నకిలీ విత్తనాలను విక్రయించే డీలర్ల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. రైతులకు సమర్ధవంతంగా సేవలు అందించేందుకు వీలుగా రైతు వేదికలలో ప్రతి మంగళవారం నిర్వహించే రైతు మేళా కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ, రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలన్నారు.
Farmer Welfare | ఎరువులు, యూరియా అందుబాటులో..
కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుకు సరిపడా యూరియా, ఇతర ఎరువుల నిలువలు అందుబాటులో ఉన్నాయని రైతులకు భరోసా కల్పించారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా యూరియా పంపిణీ సజావుగా జరుగుతోందని, ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవని అన్నారు. తెలంగాణాలో సమర్ధవంతంగా అమలు అవుతున్న ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ పద్ధతిని దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని సూచించారు. రైతులు ఎలాంటి అపోహలకు గురి కాకూడదని అన్నారు. మోతాదుకు మించి ఎరువులు వినియోగించడం వల్ల భూసారం దెబ్బతింటుందని, నానో యూరియా వినియోగంపై కూడా రైతులు దృషిని కేంద్రీకరించాలని హితవు పలికారు. వీరి వెంట నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, వ్యవసాయ అధికారి నవీన్ తదితరులు ఉన్నారు.
