అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Teacher Suspension Warning | ఉపాధ్యాయులు సమాచారం లేకుండా పాఠశాలలకు గైర్హాజరైతే షోకాజ్ జారీ చేయడం ఉండదని.. నేరుగా సస్పెండ్ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సాలూర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Teacher Suspension Warning | మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా..?
పాఠశాల ఆవరణ, తరగతి గదులను కలెక్టర్ (Collector Ila Tripathi) పరిశీలించారు. ఎఫ్ఆర్ఎస్ విధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు ప్రక్రియను ఆమె తనిఖీచేశారు. మెనూప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరాతీశారు. మౌలిక వసతులు, అందుబాటులో ఉన్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా విద్యార్థులకు పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేవని హెచ్ఎం రాజీ మంజుశ్రీ కలెక్టర్ దృష్టికి తేగా, ఐదు అదనపు తరగతి గదులను మంజూరు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. పాఠశాలకు ప్రహరీ గోడ, ప్లే గ్రౌండ్‌ను కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు. అయితే వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య మరింత గణనీయంగా పెరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Teacher Suspension Warning | సమయపాలన పాటించకపోతే..
ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ, బోధనా విధులకు హాజరు కావాలని కలెక్టర్ అన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన వారిని షోకాజ్ నోటీసులు అందించడం వంటివి కాకుండా నేరుగా సస్పెన్షన్ చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా విద్యార్థులు సైతం నూటికి నూరు శాతం మంది క్రమం తప్పకుండా బడికి హాజరయ్యేలా చూడాలన్నారు. ఎక్కువ రోజుల పాటు గైర్హాజరయ్యే విద్యార్థులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వారు ఎందుకు బడికి రావడం లేదన్నది క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలన్నారు.
Teacher Suspension Warning | విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా..
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ప్రతి విద్యార్థికి సంబంధించి తప్పనిసరిగా ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలన్నారు. ఉన్నత పాఠశాలకు ఆనుకుని ఉన్న ఉర్దూ మీడియం స్కూల్‌ను సైతం కలుపుకుని విద్యార్థులకు అనువైన రీతిలో ప్లే గ్రౌండ్ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ 8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. గణితం సబ్జెక్టుపై ప్రశ్నలు వేసి, విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేశారు. చక్కగా సమాధానాలు చెప్పిన విద్యార్థులకు బహుమతులు చాక్లెట్లు అందించారు. కలెక్టర్ వెంట ఇన్‌ఛార్జి డీఈవో సాయాగౌడ్, తహశీల్దార్ ఎంఏ నవాజ్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Bullet Reddy Movie | ఆర్మూర్ నవనాథ సిద్ధుల గుట్టపై ‘బుల్లెట్ రెడ్డి’ షూటింగ్