El Nino Telangana | 8 నెలలు అప్రమత్తంగా ఉండాలి.. ఎల్‌నినో ముప్పుపై సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు

తాగునీరు, సాగునీరు, విద్యుత్‌ పొదుపుపై ప్రత్యేక దృష్టి.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: El Nino Telangana | ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాల నేపథ్యంలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

రాబోయే ఎనిమిది నెలలు కీలకమని పేర్కొంటూ.. తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్‌ రంగాల్లో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే అంచనా వేసి, వాటిని ఎదుర్కొనేందుకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో తలెత్తే అవకాశం ఉన్న సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్య తీవ్రత పెరిగిన తర్వాత స్పందించడం కంటే.. ముందుగానే అప్రమత్తమై అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం ముఖ్యమని అధికారులకు సూచించారు.

El Nino Telangana | ప్రజలను భాగస్వాములను చేయాలి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రాబోయే ఎనిమిది నెలల పాటు ప్రతి కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని సీఎం సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజలకు పరిస్థితులపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సినిమా, మీడియా, కళాజాతాలు సహా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా నీటి వినియోగం, విద్యుత్‌ పొదుపు, వ్యవసాయ పరిరక్షణపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

దసరా తర్వాత గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైన ముందస్తు చర్యల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

El Nino Telangana | విద్యుత్‌ వినియోగంపై ప్రత్యేక దృష్టి

రానున్న రోజుల్లో విద్యుత్‌ సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్‌ కొనుగోలుకు ఎంత ఖర్చు చేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో విద్యుత్‌ లభ్యతే ప్రధాన సవాలుగా మారుతోందని తెలిపారు.

ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసరం కాని విద్యుత్‌ ఆధారిత పనులను సాధ్యమైనంత మేరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా పరిస్థితులను ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు.

El Nino Telangana | పంట చేతికొచ్చే వరకు నీటి కొరత రాకూడదు

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు సాగు చేసిన పంటల స్థితిగతులను క్షేత్రస్థాయిలో అంచనా వేయాలని సీఎం ఆదేశించారు. పంట చేతికొచ్చే వరకు అవసరమైన నీరు అందేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

నీటి కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితులను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. తాగునీరు, సాగునీటి నిర్వహణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, చుక్క నీరు కూడా వృథా కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

El Nino Telangana | 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు

రాష్ట్రంలో సుమారు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులకు అవసరమైన సహాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. కరువు మండలాల ప్రకటనతో పాటు తగిన ఆర్థిక సాయం అందించాలని కోరుతూ రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కేంద్రాన్ని కోరిన విషయాన్ని ప్రస్తావించారు.

వర్షాలు తగ్గిన ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, తక్షణ ఉపశమన చర్యలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

El Nino Telangana | ఉపాధి హామీ కింద అదనంగా 50 రోజుల పని కోరాలి

వర్షాభావ పరిస్థితులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. VB-G RAM G పథకం కింద కల్పించే 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల పని దినాలు కల్పించాలని కేంద్రాన్ని కోరాలని అధికారులకు తెలిపారు. అదనపు పని దినాలు కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

అవసరమైతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశాన్ని మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులు, రైతుల సమస్యలు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

El Nino Telangana | ప్రత్యేక వార్‌రూమ్‌, టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

ఎల్‌నినో ప్రభావానికి సంబంధించిన పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక వార్‌రూమ్‌ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు వీలుగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి అందే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టే విధంగా వ్యవస్థను సిద్ధం చేయాలని చెప్పారు.

ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *