Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

ఇప్పటి వరకు 40 వేల మందికి నోటీసులు జారీ చేసినట్లు మెట్రోవాటర్ బోర్డు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విభాగం అధికారులు వెల్లడించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hyderabad Water Crisis | ఒకవైపు అంతర్జాతీయ స్థాయి ఐటీ కారిడార్లు.. మరోవైపు ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు.. వెరసి గ్లోబల్ సిటీగా వెలిగిపోతోంది భాగ్యనగరం. అయితే, ఈ తళతళల వెనుక ఒక నిశ్శబ్ద, భీకర జల సంక్షోభం ముంచుకొస్తోంది.

ఏటా కురిసే భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తుతున్నా.. నిత్యం నగరవాసి గొంతు ఎండిపోతోంది. రూ.కోట్ల పెట్టుబడులు, కోట్ల జనాభా ఉన్న మహానగరంలో నేడు ‘నీటి ట్యాంకర్’ ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది.

అపార్ట్‌మెంట్ల నుంచి అత్యంత విలాసవంతమైన విల్లాల వరకు.. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరు నేడు నీటి కొరతతో అల్లాడుతున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు, కలుషితమవుతున్న మున్సిపల్ నీరు హైదరాబాద్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

Hyderabad Heavy Rain

Hyderabad Water Crisis | భారీ వర్షాలున్నా ఎందుకీ ఎండమావి?

హైదరాబాద్‌లో ఏటా సగటున 750 – 850 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది. అయినా నగరం జల క్షామంతో కొట్టుమిట్టాడుతోంది.

కాంక్రీట్ సామ్రాజ్యం: Hyderabad Water Crisis |నగరం వేగంగా విస్తరిస్తూ ‘కాంక్రీట్ జంగిల్’గా మారింది. మట్టి నేలలు పూర్తిగా మాయమైపోయాయి. రోడ్లు, భవనాల నిర్మాణం విపరీతంగా పెరిగింది. పడిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గం లేకుండా పోయింది.

భూగర్భ పొరల్లోకి నీరు చేరడం నిలిచిపోయింది. ప్రతి ఇల్లూ కాంక్రేట్ మయంగా మారింది. ఓపెన్ స్పేస్ అనేది ఎక్కడా కనిపించడం లేదు. ఇంటర్ లాకింగ్ టైల్స్, సిమెంట్ రోడ్ల వల్ల భూమికి ఊపిరాడటం లేదు. వర్షం పడినా చుక్క నీరు కూడా నిలవడం లేదు.

వృథాగా పోతున్న వరద: Hyderabad Water Crisis |కురిసిన ప్రతి వర్షపు చుక్కా డ్రైనేజీల్లో కలుస్తోంది. వరద నీరంతా మురుగు కాలువల ద్వారా నాళాలకు చేరుతోంది. అక్కడ నుంచి వృథాగా మూసి నదిలోకి కొట్టుకుపోతోంది. ఆపై కృష్ణా నది ద్వారా సముద్రంలో కలసిపోతోంది.

భూమి పొరలను తడపడానికి ఈ నీరు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. వరదలు వస్తున్నా అవి నగరానికి శాపంగా మారుతున్నాయే తప్ప లాభం చేకూర్చడం లేదు. నీటిని ఒడిసిపట్టే వ్యవస్థలు లోపించాయి. తుపానులు వచ్చినప్పుడు రోడ్లు చెరువులను తలపిస్తాయి. కానీ, మరుసటి రోజే మళ్లీ ఎండమావిగా మారుతోంది.

ఆక్రమణల కోరల్లో చెరువులు: Hyderabad Water Crisis |నిజాం కాలంలో నగరానికి రక్షణగా వేలాది చెరువులు ఉండేవి. అవి సహజ నీటి నిల్వ వనరులుగా పనిచేసేవి. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ హైదరాబాద్ సొంతం.

నేడు ఆ చెరువులు, కుంటలు మాయమైపోయాయి. వాటి స్థానంలో బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. అక్రమ లేఅవుట్లతో చెరువు శిఖం భూములను మింగేశారు. సహజ రీఛార్జ్ వనరులను మనమే చేతులారా నాశనం చేసుకున్నాం. నాళాలు ఆక్రమణకు గురై ప్రవాహం ఆగిపోయింది. నీరు నిల్వ ఉండే చోటు లేక భూగర్భ జలాలు పడిపోయాయి. ప్రకృతి ఇచ్చిన వనరులను కాపాడుకోలేక పోయాము.

akshara today .jpgHYD wate

Hyderabad Water Crisis | లోతు పెరుగుతోంది.. నీరు తరుగుతోంది!

గడిచిన రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో జనాభా విస్ఫోటనం సంభవించింది. ముఖ్యంగా 2005 తర్వాత నిర్మాణ రంగం ఊపందుకుంది. ఐటీ కారిడార్ అభివృద్ధి చెందడంతో వలసలు పెరిగాయి. దీనివల్ల భూగర్భ జలాలపై ఒత్తిడి తీవ్రమైంది.

అడ్డూఅదుపూ లేని బోర్లు: గ్రేటర్ హైదరాబాద్ (GHMC) పరిధిలో ప్రతి ఇంటికీ ఒక బోరు ఉంది. అనుమతులు లేని అనధికారిక బోర్‌వెల్‌ల సంఖ్య లక్షల్లో ఉంది. భూమి గర్భాన్ని విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ఒకరు బోరు వేస్తే పక్కవాడు అంతకంటే లోతుగా వేస్తున్నాడు. పోటీపడి భూమిని గుల్ల చేస్తున్నారు.

భూగర్భ జలాల నియంత్రణ చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయి. వాణిజ్య అవసరాల కోసం భారీ మోటార్లతో నీటిని తోడేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా భూగర్భ సంపదను దోచేస్తున్నారు. దీనివల్ల పొరుగున ఉన్న సాధారణ బావులు, బోర్లు ఎండిపోతున్నాయి.

పాతాళానికి జలాలు: ఒకప్పుడు 100 – 200 అడుగుల లోతులోనే లభించిన నీరు, నేడు పాతాళానికి చేరింది. నగరంలోని చాలా ప్రాంతాలలో 1000 అడుగులు దాటినా తడి తగలడం లేదు. కొన్నిచోట్ల 1500 అడుగులకు వెళ్ళినా చుక్క నీరు దొరకని పరిస్థితి ఉంది.

హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ఇప్పటికే ‘Over-exploited’ జోన్లుగా మారాయి. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు వీటిని రెడ్ జోన్లుగా ప్రకటించింది. వీటిల్లోని కొన్ని ప్రాంతాల భూగర్భంలో నీటి నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. రాతి పొరలు మాత్రమే మిగిలాయి. ఎంత లోతుకు వెళ్లినా పొడి మట్టి మాత్రమే వస్తోంది.

akshara today .jpg tanker

Hyderabad Water Crisis | ట్యాంకర్ల రాజ్యం: మధ్యతరగతిపై మోయలేని భారం

గచ్చిబౌలి, మణికొండ, మాదాపూర్ ప్రాంతాలు ఐటీ హబ్‌లుగా మారాయి. కూకట్‌పల్లి, మియాపూర్ వంటి జోన్లలో హై-రైజ్ అపార్ట్‌మెంట్లు వెలిశాయి. ఈ ప్రాంతాలలో నిత్యం వందలాది నీటి ట్యాంకర్లు పరుగులు తీస్తున్నాయి.

ఆర్థిక దోపిడీ: ఒక్కో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ కేవలం నీటి ట్యాంకర్ల కోసమే నెలకు రూ. 50,000 ఖర్చు చేస్తోంది. పెద్ద సొసైటీలు అయితే నెలకు రూ. 3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నాయి. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ ఈ ట్యాంకర్ల ధరలు ఆకాశాన్ని తాకుతాయి.

ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. సామాన్యుడి సంపాదనలో సగం నీటికే సరిపోతోంది. నీటి కొనుగోలు అనేది కుటుంబ బడ్జెట్‌ను శాసిస్తోంది. వేసవి వచ్చిందంటే జనం గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ట్యాంకర్ల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

సామాజిక అశాంతి: నీటి కొరత కుటుంబాల మధ్య గొడవలకు దారితీస్తోంది. అపార్ట్‌మెంట్ అసోసియేషన్లలో నిత్యం వివాదాలు జరుగుతున్నాయి. నీటి వాడకంపై ఆంక్షలు విధిస్తున్నారు. వాషింగ్ మెషీన్లు వాడకూడదని నిబంధనలు పెడుతున్నారు.

కార్లు కడగడం, మొక్కలకు నీళ్లు పోయడం నిషేధించారు. రోజుకు రెండు గంటలు మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. దీనివల్ల గృహిణులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల చదువులు, ఆఫీసు పనులపై ఈ ప్రభావం పడుతోంది. నీరే జీవన విధానాన్ని మార్చేస్తోంది.

Hyderabad Water Crisis | కాలుష్య కోరల్లో కవల నగరాలు

నీటి పరిమాణం తగ్గడమే కాదు, నాణ్యత కూడా దారుణంగా పడిపోతోంది. కలుషిత నీరు నగరవాసుల ఆరోగ్యాన్ని హరిస్తోంది.

విషతుల్యమైన మూసి: మూసి నది ఒకప్పుడు నగరానికి జీవనది. నేడు అది కేవలం మురుగు కాలువగా మారింది. పారిశ్రామిక రసాయన వ్యర్థాలు (Chemical Effluents) నేరుగా మూసిలో కలుస్తున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రసాయనాలు భూమిలోకి ఇంకుతున్నాయి.

దీనివల్ల భూగర్భ జలాలు పూర్తిగా విషపూరితంగా మారాయి. ఆ నీటిని ముట్టుకుంటేనే చర్మ వ్యాధులు వస్తున్నాయి. కూరగాయల పెంపకానికి ఈ నీటినే వాడుతున్నారు. ఆ ఆహారం తిని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.

డ్రైనేజీ లీకేజీల ముప్పు: హైదరాబాద్‌లోని మురుగునీటి పైప్‌లైన్లు దశాబ్దాల నాటివి. వాటి పక్కనే తాగునీటి మున్సిపల్ పైప్‌లైన్లు వెళుతున్నాయి. చాలా చోట్ల ఈ పైప్‌లైన్లు తుప్పుపట్టి లీకేజీలు ఏర్పడుతున్నాయి. మురుగునీరు లీకై తాగునీటిలో కలుస్తోంది.

భయంకర రసాయనాలు: బోర్లు మరీ లోతుకు వేయడం వల్ల ప్రమాదకర రసాయనాలు బయటపడుతున్నాయి. నీటిలో ఫ్లోరైడ్ మోతాదు విపరీతంగా పెరిగింది. నైట్రేట్లు, ఆర్సెనిక్, హెవీ మెటల్స్ నీటిలో ఉంటున్నాయి.

akshara today .jpgwater

Hyderabad Water Crisis | వెస్ట్ సిటీలో క్షేత్రస్థాయి వాస్తవాలు: వాటర్ బోర్డు ఆరా

వెస్ట్ సిటీలోని ఆయా ప్రాంతాల నుంచే భారీ సంఖ్యలో ట్యాంకర్ల బుకింగ్ జరుగుతోంది. దీనిపై వాటర్ బోర్డు అధికారులు లోతుగా ఆరా తీశారు. కూకట్‌పల్లి, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, ప్రాంతాలలో సర్వేలు చేశారు.

మాదాపూర్, ఐటీ కారిడార్, కొండాపూర్ వంటి చోట్ల తనిఖీలు చేపట్టారు. చందానగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు పర్యటించాయి. ఈ ప్రాంతాల్లో నిర్వహించిన సర్వేల్లో దిబ్బతిరిగే అంశాలు వెలుగుచూశాయి.

2000 ఫీట్లు వేసినా కానరాని నీరు: ఆయా ప్రాంతాల్లో హైరైజ్ భవనాలు ఎక్కువగా ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీలు భారీగా వెలిశాయి. దీనివల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటినట్టు అధికారులు గుర్తించారు.

ఇతర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల మేరకు బోర్లు ఉండగా, ఈ వెస్ట్ జోన్ ప్రాంతాల్లో రెండు వేల ఫీట్లు వేసినా నీళ్లు రావడం లేదని చెబుతున్నారు. భూగర్భ జలాల మట్టం దారుణంగా పడిపోయింది. రాతి పొరల్లో ఉన్న చివరి చుక్కను కూడా తోడేశారు.

80 వేల ట్యాంకర్ల బుకింగ్లు: ఈ వెస్ట్ ప్రాంతాల నుంచే గతేడాది రోజుకు వాటర్ బోర్డుకు 80 వేల ట్యాంకర్ల బుకింగ్లు వచ్చాయట. ఈసారి కూడా అవే ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో బుకింగ్లు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా నీటిని సరఫరా చేయడం బోర్డుకు సవాలుగా మారింది. నీటి వనరులు సరిపోకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు.

40 వేల మందికి నోటీసులు: ఆయా ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం అస్సలు లేనట్లు అధికారులు గుర్తించారు. పెద్ద పెద్ద భవనాలు ఉన్నా వర్షపు నీటిని నిల్వ చేసే ఆలోచన చేయడం లేదు.

దీంతో ఇప్పటి వరకు 40 వేల మందికి నోటీసులు జారీ చేసినట్లు మెట్రోవాటర్ బోర్డు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విభాగం అధికారులు వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలకు ఉపక్రమిస్తామన్నారు

ట్యాంకర్ ఛార్జీలు రెట్టింపు ప్రతిపాదన: నోటీసులు అందుకున్న వారు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకోని వారిపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు.

అలాంటి వారి నుంచి ట్యాంకర్ ఛార్జీలను రెట్టింపు వసూలు చేసే ప్రతిపాదన ఉందని అధికారులు వెల్లడించారు. జరిమానా విధిస్తేనే మార్పు వస్తుందని భావిస్తున్నారు.

akshara today .jpginkudu g

Hyderabad Water Crisis | ముందుకు సాగే మార్గం లేదా..

ఈ భీకర జల సంక్షోభం నుంచి హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. కాలయాపన చేస్తే భవిష్యత్తు అంధకారమవుతుంది.

ఇంకుడు గుంతలు నిర్బంధం: ప్రతి అపార్ట్‌మెంట్, విల్లా, ప్రభుత్వ భవనంలో వర్షపు నీటి సంరక్షణ (Rainwater Harvesting) గుంతలను కచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇది కేవలం కాగితాల మీద, ప్లాన్ అప్రూవల్ కోసం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో నిజంగా నిర్మించాలి.

అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలి. ఇంకుడు గుంతలు లేని భవనాలకు నీటి కనెక్షన్ కట్ చేయాలి. వర్షపు నీటిని భూమిలోకి పంపడం ద్వారానే భూగర్భ జలాలు మళ్లీ పైకి వస్తాయి.

చెరువుల పునరుద్ధరణ: ఈ విషయంలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తున్నా.. మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆక్రమణకు గురైన చెరువులను యుద్ధప్రాతిపదికన గుర్తించాలి. అక్రమ కట్టడాలను కూల్చివేయాలి.

నిజాం కాలం నాటి సహజ నీటి కాలువల నెట్‌వర్క్‌ను (Chain of Lakes) పునరుద్ధరించాలి. ఒక చెరువు నిండితే మరో చెరువులోకి నీరు వెళ్లేలా చూడాలి. చెరువులలో పూడిక తీయాలి. గుర్రపుడెక్కను తొలగించి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. చెరువుల చుట్టూ బ్యూటిఫికేషన్ చేసి పర్యాటక ప్రాంతాలుగా మార్చాలి.

లీక్-ప్రూఫ్ టెక్నాలజీ: Hyderabad Water Crisis | తాగునీటి, మురుగునీటి లైన్లను పూర్తిగా వేరు చేయాలి. అత్యాధునిక జియో-సెన్సింగ్ సాంకేతికతతో లీకేజీలను అరికట్టాలి. పైప్‌లైన్ల మరమ్మతులు సకాలంలో చేపట్టాలి.

పాతబడిన లైన్ల స్థానంలో కొత్త హెచ్‌డీపీఈ (HDPE) పైపులను వేయాలి. మున్సిపల్ నీరు కలుషితం కాకుండా కఠినమైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలి. ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత.

రీసైక్లింగ్ (Greywater Recycling): Hyderabad Water Crisis | అపార్ట్‌మెంట్లు, ఐటీ పార్కులలో ‘సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్’ (STP) నిర్వహణను కచ్చితం చేయాలి. వాడిన నీటిని వృథాగా డ్రైనేజీలోకి వదలకుండా శుద్ధి చేయాలి.

రీసైకిల్ చేసిన నీటిని ఫ్లషింగ్‌కు, గార్డెనింగ్‌కు వాడాలి. దీనివల్ల తాగునీటిపై 40 శాతం ఒత్తిడి తగ్గుతుంది. పరిశ్రమలు కూడా శుద్ధి చేసిన మురుగునీటినే వాడుకునేలా ప్రోత్సహించాలి. ప్రతి చుక్క నీటిని పునరావృతం వాడటం అలవాటు చేసుకోవాలి.

ప్రజల్లో అవగాహన పెంపొందించడం: Hyderabad Water Crisis | నీటి పొదుపుపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు నేర్పించాలి. కాలనీల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. నీటిని వృథా చేసే వారికి జరిమానాలు విధించాలి.

పొదుపుగా వాడే వారికి రాయితీలు ఇవ్వాలి. స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా భావించినప్పుడే జల సంరక్షణ సాధ్యమవుతుంది.

హైదరాబాద్ కేవలం ఆర్థికంగా, సాంకేతికంగా ఎదగడమే కాదు… పర్యావరణపరంగా జీవించదగ్గ నగరంగా (Sustainable City) మిగలాలి. ఆకాశహర్మ్యాలు, ఐటీ కంపెనీలు ఎన్ని ఉన్నా తాగడానికి నీరు లేకపోతే ఆ ప్రగతి శూన్యం. నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత.

నేడు మనం నిర్లక్ష్యం చేస్తే, రేపు మన పిల్లలు నీటి చుక్క కోసం అల్లాడవలసి వస్తుంది. భవిష్యత్తులో నీటి కోసమే వలసలు వెళ్లాల్సిన ఐటీ నగరంలా హైదరాబాద్ మారే ప్రమాదం పొంచి ఉంది. ‘జల సంరక్షణే జీవన రక్షణ’ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరు నిజం చేయాలి. అప్పుడే భాగ్యనగరం సుభీక్షంగా ఉంటుంది.

School Kitchen Shed | బడి రుణం.. తమ్ముడి స్మరణం: సిరికొండ జెడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి అక్షరార్చన!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *